లబ్బీపేట(విజయవాడతూర్పు): సంజీవని కార్యక్రమం ద్వారా అందించే వైద్య సేవలు వందశాతం ప్రజలకు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు అన్నారు. నగరంలోని కేబీఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న సంజీవని శిక్షణలో భాగంగా 5వ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ప్రోగ్రామ్ అధికారులు, వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, సందర్శించిన డీఎంహెచ్ఓతో పాటు, ప్రోగ్రామ్ అధికారులకు సంజీవని ద్వారా అందించనున్న వివిధ వైద్య సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. అనంతరం డాక్టర్ శ్రావణ్బాబు మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో లెప్రసీ, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భానూనాయక్, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతీదేవి, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవీ నాయుడు, డీఎంఓ డాక్టర్ రాజునాయక్, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.


