పామర్రు: అవినీతిమయమైన చంద్రబాబు పాలనను అంతమొందించడానికి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కలిసి కట్టుగా పనిచేయాలని పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పిలుపిచ్చారు. స్థానిక ఆరేపల్లి కల్యాణ మండపంలో శనివారం పార్టీ పామర్రు నియోజకవర్గ నేతలతో విస్తృత స్థాయి సమావేశం పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. పేర్ని నాని మాట్లా డుతూ.. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలను ఓడించి కూటమి ప్రభుత్వ పతనానికి తొలిమెట్టును నిర్మించాలన్నారు. కూటమి నేతలకు ముడుపులు ఇచ్చి కీలక పోస్టుల్లోకి వచ్చిన అధికారులు బరితెగించి లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఎండలను, సముద్రాన్ని ఏవిధంగా కంట్రోల్ చేయాలో కసరత్తు చేస్తున్నానని చంద్రబాబు అంటున్నారని, ప్రజలు మాత్రం పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రిస్తే చాలని కోరుకుంటున్నారన్నారు. విశాఖపట్నం ప్రజలకు రోజువారీ తాగునీరు అందించలేని చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్‌కు మాత్రం రోజూ 28 కోట్ల లీటర్ల నీరు అందిస్తానని ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తానన్న వ్యక్తి కేరళకు పరిమితమయ్యా రని ఎద్దేవాచేశారు.
మహిళా లోకం మేల్కొనాలి
కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సును ఎర వేసి మహిళలను మోసం చేస్తోందని నాని విమర్శించారు. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, డ్వాక్రా రుణ మాఫీలు, పావలా వడ్డీలు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా మోసం చేస్తోందన్న విషయాన్ని మహిళలు గ్రహించి మేల్కొనాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో సాగుకు నీరులేక రైతులు అలో... లక్ష్మణా అంటూ బాధ పడుతున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళికలతో సాగుకు నీటిని అందించామని గుర్తుచేశారు. జిల్లాలో అత్యధికంగా సాగు చేసేది పామర్రు నియోజకవర్గమని, ఈ ఖరీఫ్‌లో మూడు వేల ఎకరాల మేర కూడా సాగవకపోవడం విచారకరమని అన్నారు. మచిలీపట్నంలో రూ.4 కోట్ల ఖర్చుతో వినాయకుడి విగ్రహం పెట్టి సంబరాలు చేస్తున్నారని, రైతును మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదని పేర్ని నాని విమర్శించారు. శిశుపాలుని తప్పులను లెక్కపెట్టే విధంగా ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికల వస్తాయా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రానున్నది జగనన్న ప్రభుత్వమేనని, ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు.
కూటమి కుట్రలను తిప్పికొడదాం
మాజీ ఎమ్మెల్యే ౖకైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సైనికుల్లా పనిచేసి విజయబావుటా ఎగురవేయాలని కోరారు. అందరూ ఒకే కుటుంబంలా ఉండి కూటమి నేతల కుట్రలను తిప్పి కొట్టాలని సూచించారు. వైఎస్సార్ సీపీ మచిలీపట్నం ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేకపోయినా జగన్ కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి పార్టీలో ఉన్న వారిని అభినందించారు. కూటమి పాలన పాపాలను అంతం చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పెనమలూరు ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో పార్టీ కోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పని చేసి పార్టీకి అండగా ఉండాలని కోరారు. అవనిగడ్డ ఇన్చార్జి సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వ్యవసా యాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అన్నారు. పెడన ఇన్చార్జి ఉప్పాల రాము మాట్లాడుతూ అక్రమ కేసులతో వైఎస్సార్ సీపీ శ్రేణులను భయపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయ పడేది లేదని అన్నారు. రానున్న ఎన్నికలలో ప్రజా వ్యతిరేక పాలనకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని


