చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ కోసం గుర్తించిన మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ ఈ కామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కమిటీ, కమిటీ పరిధిలోని లేని వివిధ కేటగిరీల్లో 33 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తుది మెరిట్ జాబితాను వెబ్‌సైట్ https:krishna.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి మెరిట్ జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేటి సమాజంలో మన మూలాలను, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి పిలుపునిచ్చారు. నగరంలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల సెమినార్ హాల్‌లో భారత్ వికాస్ పరిషత్ విజయవాడ మెయిన్, సెంట్రల్, ఈస్ట్ బ్రాంచిల ఆధ్వర్యంలో నిర్వహించిన బృందగాన పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందీ, సంస్కృత భాషల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆమె బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లలకు సంగీతం, ప్రాచీన భాషలైన హిందీ, సంస్కృతంలో పాటలు నేర్పిస్తే వారిలో ఏకాగ్రత, క్రమశిక్షణతో పాటు జాతీయ భావన ఎంతో పెరుగుతాయని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే కళలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పోటీల విజయవాడ బ్రాంచ్ విభాగంలో సుమారు 26 పాఠశాలల నుంచి 350 మందికి పైగా విద్యార్థులు 58 జట్లుగా ఏర్పడి ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లు తర్వాత స్టేట్, సౌత్ రీజినల్, నేషనల్ స్థాయి పోటీలకు ఎంపికవుతాయని నిర్వాహకులు డాక్టర్ చుండూరు మురళీధర్ తెలిపారు. భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు, చందోలు ఆంజనేయులు, నాగేశ్వరరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను విజయవాడపోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, డీఈవో కిషోర్‌కుమార్.. సీపీకి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఇచ్చారు.
చిలకలపూడి(మచిలీపట్నం): గ్యాస్ వినియోగదారులకు సకాలంలో నిరంతరాయంగా సేవలు అందించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి టి.శివరామప్రసాద్ అన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో ఎల్‌పీజీ డీలర్లు, రేషన్‌షాపుల డీలర్ల సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘దీపం’ సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో జమ కాలేదని వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా లబ్ధిదారులకు అవసరమైన సమాచారం అందించాలన్నారు. గ్యాస్ బుకింగ్, సిలిండర్ డెలివరీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల నుంచి నిర్ణయించిన ధరకు మించి అదనపు మొత్తాలను వసూలు చేయకూడదన్నారు. రేషన్ డీలర్లకు సంబంధించి ప్రజాపంపిణీ వ్యవస్థలో ఐవీఆర్‌ఎస్‌లో నమోదవుతున్న ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. రేషన్ కార్డుదారులు సరుకుల నాణ్యత బాగుందా, సరుకుల పరిమాణం, తూకం, పంపిణీ విధానం తదితర అంశాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సేవల్లో అవసరమైన మెరుగుదలను చూపించాలన్నారు. పదే పదే ఫిర్యాదులు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


