రైతు కంటతడి నీరందక ఎండుతున్న నారుమళ్లు
పెడన: వరుణుడి కోసం రైతన్న ఎదురుచూస్తున్నాడు. జల జాడ లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుతం పంటలకు నీరు అందని పరిస్థితి నెల కొంది. మొన్నటి వరకు అడుగంటిన నీటితో చేలను తడిపి, మధ్యలో వర్షాలతో దుక్కులు దున్ని వెదజల్లిన రైతన్న నేడు నీరందక వేసిన నారుమడిని బతికించేందుకు నానా ఆగచాట్లు పడుతున్నాడు. అన్నదాతలు పూర్తిగా వర్షాలపై ఆధారపడ్డారు. కాలువలపై పంటలు పండించే రైతులు వాటిని ఎప్పుడు వదులుతారో అని కాచుకుని ఉన్నారు. అడుగంటిన నీటిని సైతం తోడేసి నాలుగైదు రోజులు వరకు పంటను కాపాడుకునే యత్నాలు చేస్తున్నారు. మరికొందరు పూర్తిగా వదిలేసి మళ్లీ దుక్కులు దున్ని వెదజల్లేందుకు సిద్ధమవుతుంటే ఇంకొందరు నారు కొనుగోలు చేద్దామనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అదను పోయి పంట ఆలస్యం కావడంతో రైతన్నలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని 20 వేల ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. చెన్నూరు, చేవెండ్ర, కమలాపురం, గురువిందగుంట, నందిగామ, నందమూరు, బల్లిపర్రు ఇలా చాలా గ్రామాల్లో రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. రాత్రిళ్లు ఇంజిన్లు పెట్టి తోడినా ఫలితం ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేల నెర్రలు ఇవ్వడంతో రైతులు కుంగిపోతున్నారు. కొందరు పైన నీరుంటే ఇప్పటికే కాలువలు ద్వారా నీరు వదిలేవారని అంటుంటే మరికొందరు నీరున్నా ఇవ్వడం లేదనే వాదన చేస్తూ నీటి కోసం చూస్తున్నారు.
మోటరు ఇంజిన్‌కు కూడా నీరందని పరిస్థితి
ఎండిన మడి..
నీరందక ఎండుతున్న నారుమళ్లు
● బీటలు వారుతున్న వెదజల్లిన పంట పొలాలు
● అన్నదాతలు నీటి కోసం ఎదురుచూపులు
సాగు నీరందక నారుమళ్లు ఎండిపోతుండగా.. ఇప్పటికే నాట్లు వేసిన పొలాలు బీటలు వారుతున్నాయి. కాలువల్లో నీటి జాడ లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అప్పులతో సాగు ప్రారంభించిన అన్న దాతలు ఇప్పుడు వరుణుడి కోసం చూస్తున్నారు. సాగునీటిని విడుదల చేయకపోతే వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.