ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిర్వహిస్తున్న వేద పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. పోరంకిలోని వేద పాఠశాలలో ప్రవేశాలకు దేవస్థానం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వేద పాఠశాలకు విచ్చేశారు. తొలుత విద్యార్థులు సమర్పించిన దరఖాస్తులను పరిశీ లించి ప్రవేశ పరీక్షలకు అనుమతించారు. అనంతరం ఆలయ వేద పండితులు, అర్చకుల సమక్షంలో వారికి ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. వేద పాఠశాలలో ప్రవేశాల కోసం మొత్తం 20 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, గురువారం జరిగిన ప్రవేశ పరీక్షలకు 13 మంది హాజరైనట్లు సూపరింటెండెంట్ చందు శ్రీనివాస్ తెలిపారు. ప్రవేశ పరీక్షలను వేద పాఠశాల ప్రిన్సిపాల్ నూరి రాధాకృష్ణ అవధాని, వేద పాఠశాల పర్యవేక్షకులు రంగావజ్జుల శ్రీని వాసశాస్త్రి, అధ్యాపకులు కూరపాటి ఆంజనేయ శాస్త్రి, చిట్టి చంద్రశేఖరశర్మ తదితరులు నిర్వహించారు. ప్రవేశ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు మరోసారి పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటిస్తారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లో ఈసెట్–2026లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం మొదలైంది. క్యాప్ 1 నుంచి 10 వేల లోపు ర్యాంకు, ఎన్సీసీ 1 నుంచి 15 వేల ర్యాంకు లోపు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 1 నుంచి 15 వేల లోపు ర్యాంకు, ఆంగ్లో ఇండియన్స్ 1 నుంచి చివరి ర్యాంక్ పొందిన వారి సర్టిఫికెట్లను గురువారం పరిశీలించారు. మొత్తం 476 మంది స్పెషల్ కేటగిరి ర్యాంకర్ల సరిఫ్టికెట్లను పరిశీలించామని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.
● శుక్రవారం క్యాప్ 20,001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్సీసీ 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు, దివ్యాంగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ –1 నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని తెలిపారు.
ప్రకటించిన ఏపీ రాష్ట్రోపాధ్యాయసంఘం
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో 2027 ఫిబ్రవరిలోగానీ మార్చిగానీ జరగబోయే కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఉద్యమ నేత సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబును ఎస్టీయూ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతున్నట్లు ఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాధరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రకటించారు. ఎస్టీయూ రాష్ట్ర 79వ వార్షిక కౌన్సిల్, కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మూడు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానం ఆయనిదన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగుల పెన్షనర్ల వాణిని శాసనమండలిలో బలంగా వినిపించడానికి కలిసి వచ్చే ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించామన్నారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, గురుకుల విభాగ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, మోడల్ స్కూల్ నేత సుబ్రహ్మణ్యం, కేజీబీవీ విభాగం నాయకులు రత్నమాలినీదేవి, శేషాలత, ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు కేవీ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.


