● మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు
డిమాండ్
● రేపు అవనిగడ్డ నుంచి
నాగాయలంక వరకూ పాదయాత్ర
అవనిగడ్డ: ఎదురుమొండి వారధి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీ అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ పాదయాత్ర నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు వెల్లడించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎదురుమొండి దీవుల ప్రజలు రహదారి సౌకర్యం లేక ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో వారధి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ. 109 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేయించారని చెప్పారు. గత ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచినా ఎన్నికల ముందు ఎవరూ రాకపోవడంతో ప్రక్రియ కొనసాగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై ఈనెల 11వ తేదీ అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకూ పాదయాత్ర చేయనున్నట్టు సింహాద్రి తెలిపారు. పాదయాత్రను పార్టీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు, ఎదురుమొండి దీవుల ప్రజలు విజయవంతం చేయాలని సింహాద్రి కోరారు.
హైజాక్ చేయడం
బుద్ధప్రసాద్‌కు వెన్నతో పెట్టిన విద్య
హైజాక్ రాజకీయాలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు వెన్నతో పెట్టిన విద్యని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పేర్కొన్నారు. పులిగడ్డ–పెనుమూడి వారధి కోసం గతంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో దీక్షలు చేస్తే చివరిలో వచ్చిన ఉద్యమాన్ని హైజాక్ చేశారని గుర్తు చేశారు. ఎదురుమొండి వారఽధి నిర్మాణం చేయించి తన తండ్రి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని సింహాద్రి పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మద్ది చిన్నా, మోపిదేవి మండల కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు నలుకుర్తి పృధ్వీరాజ్, బీసీసెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చెన్ను రంగారావు, పార్టీ జిల్లా కార్యదర్శి తోట సాయిబాబు, నాగాయలంక మండల యూత్ అధ్యక్షుడు రేమాల నాగరాజు, పంచాయితీరాజ్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బండారు సూరిబాబు పాల్గొన్నారు.


