మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగితే క్రీడల్లో రాణించవచ్చునని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. స్థానిక పటమట హైస్కూల్ ఆవరణలో 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో బాస్కెట్‌బాల్ ఒకటన్నారు. చదువుతో పాటుగా క్రీడలకు యువత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. భవిష్యత్తులో విజయవాడ నగరం మరిన్ని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదిక కావాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోస్ మాట్లాడతూ రోజుకు 20 మ్యాచ్‌లు జరుగుతున్నాయని, నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయన్నారు. అసోసియేషన్ సభ్యులు రాజ్ కుమార్, చక్రవర్తి, పి.సురేష్ బాబు, పటమట హైస్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ యలమంచిలి రవి పాల్గొన్నారు
మైలవరం: మైనర్ బాలిక అదృశ్యం కేసులో ఒకరిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం మైలవరంలోని బాలికల పాఠశాలలో ఒక బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆ బాలిక తల్లి మైలవరం రైతు బజారులో కూరగాయల దుకాణం నిర్వహిస్తుంది. బాలిక తల్లికి సహాయంగా దుకాణంలో ఉండేది. మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన మాగంటి నాగరాజు(24) బైక్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. నాగరాజు కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో బాలికతో పరిచయమైంది. గత నెల 30న బాలిక పాఠశాల నుంచి వెళ్లి పోవడంతో బాలిక తండ్రి మైలవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాలిక అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు మాయ మాటలు చెప్పి పాఠశాల నుంచి నాగరాజు తీసుకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నాగరాజుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు అనంతరం మైలవరం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
పెనమలూరు: గంజాయి వినియోగం అరికట్టడానికి బ్లాక్‌స్పాట్స్ గుర్తించామని సీఐ ఎన్. వెంకటనారాయణ చెప్పారు. వణుకూరు గ్రామంలో గురువారం ఆయన ఈగల్ టీమ్ సీఐ ఎం.రవీంద్రతో శివారు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత గంజాయి తాగటానికి ఎంపిక చేసుకుంటున్న బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి చర్యలు చేపట్టామన్నారు. పొదల చాటున అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా ఉండటానికి శివారు ప్రాంతాల్లో గుబురుగా పెరిగిన చెట్లను జేసీబీతో తొలగించామన్నారు. దట్టమైన గుబురు ప్రదేశాలను గంజాయి వినియోగదారులు ఎంపిక చేసుకుటున్నట్లు తమ దృష్టికి రావటంతో ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆయా గ్రామాల ప్రజలు కూడా పోలీసులకు సమాచారం ఇస్తే అసాంఘిక కార్యకలాపాలు నివారించటానికి చర్యలు తీసుకుంటా మన్నారు.
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ 5న ప్రదానం చేయనున్న రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని తనిఖీ అధికారులైన ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్‌లు, ప్రధానోపాధ్యాయులకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను సంబంధిత తనిఖీ అధికారుల సిఫారసులతో జూలై 15లోపు సమర్పించాలని సూచించారు. సిఫారసు చేసిన దరఖాస్తులను జూలై 22 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, మచిలీపట్నంలో రెండు ప్రతుల్లో అందజేయాలన్నారు. తనిఖీ అధికారుల సిఫారసు లేని దరఖాస్తులు, ఈ–మెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.


