పేరుకే స్వర్గం...సౌకర్యంలో నరకం నాగాయలంక: నాగాయలంక నుంచి బీహెచ్‌ఈఎల్(హైదరాబాద్)కు ఎన్నో ఏళ్లుగా రాత్రి 8.30 గంటలకు నడుపుతున్న ఇంద్ర ఏసీ సర్వీస్ రెండు బస్సులు(అప్ అండ్ డౌన్) సౌకర్యాల విషయంలో నరకం చూపిస్తున్నాయి. చాలా ఏళ్ల కిందట అవనిగడ్డ డిపోకు ఇంద్ర ఏసీ బస్సులు మంజూరైనప్పుడు ఇక్కడకు కొత్త బస్సులను పంపకుండా వాటిని మరో డిపోకు కేటాయించి, ఇక్కడకు అప్పటికే ఇతర జిల్లాల్లో తిరిగిన బస్సులను పంపించారని ఒక అభియోగం ఉంది. ఈ కారణంగా అవి వచ్చేటప్పటికే సీటింగ్ విధానం సరిలేదని ప్రయాణికులు రుసరుసలాడారు. అప్పటి నుంచి క్రమేణా ఏసీ సర్వీసు టికెట్ ధరలు పెరుగుతూ వస్తున్నాయే తప్ప సౌకర్యాలు మాత్రం దిగజారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నాగాయలంక నుంచి బీహెచ్‌ఈఎల్‌కు టికెట్ ధర రూ.900 పైచిలుకు చేరింది.
బస్సులలో సీటింగ్ విధానం సరిలేక కుషనింగ్ పోయి గట్టిపడటంతో సీట్లలో జారుడు బల్లల మాదిరిగా ముందుకు జారిపోతూ ఎప్పటి కప్పుడు వెనక్కి సర్దుకోవడంతో నడుము నొప్పులు, కాళ్ల వాపులు వస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. సీట్లపై నుండే మినీ ఏసీ కంపార్ట్‌మెంట్ బాక్స్‌లు సరిగా పనిచేయవు. కొందరు డ్రైవర్లు ప్రయాణికులు నిద్రలోకి జారుకోగానే ఏసీని ఆపివేస్తుండటంపై ప్రయాణికులు తరచుగా గొడవకు దిగడం జరుగుతోంది.
ఇంద్ర సర్వీసులలో గతంలో పనిచేసిన టీవీలు ప్రస్తుతం పూర్తిగా మాయం అయ్యాయి. ఆర్టీసీ ఈ వ్యవస్థను పూర్తిగా తొలగించిందో లేక ఈ బస్సులలో టీవీలు తొలగించారో చెప్పే నాథుడు లేడు. డ్రైవింగ్ క్యాబిన్ వెనుక పార్టీషన్ పార్ట్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ సర్వీసులు విజయవాడ చేరుకునేసరికి రాత్రి 12గంటల సమయం అవుతుంది. టీవీ సౌకర్యం తొలగించడంతో కాలక్షేపం వెసులుబాటు కూడా ప్రయాణికులకు కొరవడింది.
ఇంద్ర బస్సుల టాప్ పైన రేకులు సీలింగ్‌లో కదలిపోవడంతో వర్షాల సమయంలో సీట్లలోకి నీళ్లు పడి తడిచి పోవడం పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో బస్సులపై రేకులు గాలికి టపాటపా కొట్టుకోవడం, పలుచోట్ల కదిలి ఊడిపోయిన బోల్ట్‌లతో బస్సుల లోపల రణగొణ ధ్వనులు అధికమయ్యాయి. ఇతర ప్రాంతాల్లో వాడేసిన బస్సులు ఇక్కడకి రావడం వచ్చాక ఏళ్లు గడవటంతో బస్సులు శిథిలావస్థకు చేరాయి.
రెండు ఏసీ బస్సులకు లగేజి బాక్సులు ఉన్నప్పటికీ అవి ప్రయాణికుల లగేజీల కంటే చేపల వ్యాపారులకే ఎక్కువగా వినియోగపడుతున్నాయి. కొంతకాలంగా ఆర్టీసీ లాజిస్టిక్స్ వ్యాపారం ఆరంభించడం, అందుకు ఏసీ సర్వీసులను సైతం వినియోగించడంతో లోడింగ్, అన్ లోడింగ్‌లతో ఒక్కోసారి 30–45నిమిషాలు జాప్యం అవుతోంది. దీనివలన ప్రయాణికులు సీట్లలో తీవ్ర అసహనంతో కూర్చోవలసి వస్తుందని వాపోతున్నారు. లాజిస్టిక్స్ రవాణాకు వినియోగదారుల వద్ద రసీదులతో కూడిన బిల్లులు వసూలు చేస్తున్నప్పటికీ ఎలాంటి రసీదు లేకుండా సిబ్బందికి ఇవ్వాలనే పేరుతో అదనపు వసూళ్లు తప్పడంలేదు.
అసౌకర్యాల నిలయాలుగా ఆర్టీసీ అవనిగడ్డ డిపో ఇంద్ర బస్సులు మైలేజీ పూర్తికాక పోయినా శిథిలావస్థకు చేరిన వైనం జారుడు బల్లలుగా మారిన సీట్లు పల్లెవెలుగు బస్సుల మాదిరి రణగొణ ధ్వనులు
బస్సులు దెబ్బతిన్న మాట వాస్తవమే
ప్రస్తుతం నడిచే ఇంద్ర సర్వీస్ బస్సుల మైలేజీ ఇంకా పూర్తి కాలేదని అయినా బస్సులు దెబ్బతిన్న పరిస్థితి వాస్తవమేనని అవనిగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు అన్నారు. తీరప్రాంత ఉప్పు గాలుల కారణంగా అవనిగడ్డ, బందరు డిపోల్లో బస్సులు ఇలా అవుతున్నాయని చెప్పారు. త్వరలో పూర్తిగా బాగుచేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఈలోగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే సర్దుబాటు చేస్తున్నామన్నారు.
–హనుమంతరావు, అవనిగడ్డ
ఆర్టీసీ డిపో మేనేజర్
మేడిపండు చూడ మేలిమైయుండు... పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న సామెత గుర్తొస్తుంది అవనిగడ్డ డిపో ఇంద్ర బస్సులను చూస్తే...ఇంద్ర బస్సు అనగానే ఇంద్రలోకాన్ని తలపించేలా ప్రయాణికులకు సౌకర్యాలు ఉంటాయనుకుంటే అది మీ భ్రమే. ఈ మాట నమ్మకపోతే ఒక్కసారి అవనిగడ్డ డిపో నుంచి నడిచే ఇంద్ర బస్సులు ఎక్కి చూడండి.. మీకే తెలుస్తుంది. ఎక్స్‌ప్రెస్‌కు ఎక్కువ...లగ్జరీకి తక్కువ అన్నట్టుంటాయి.
సీటింగ్–సీలింగ్ అస్తవ్యస్తం
టీవీల సౌకర్యం మాయం
వర్షాకాలంలో బస్సుల లోపలకి వాన జల్లు
వ్యాపారులకే లగేజి బాక్సులు, అదనంగా లాజిస్టిక్స్ సర్వీసు