డ్వాక్రా సంఘాల నిధులు గోల్‌ మాల్‌ | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా సంఘాల నిధులు గోల్‌ మాల్‌

Jul 10 2026 9:39 AM | Updated on Jul 10 2026 9:39 AM

సుమారు రూ.70 లక్షల వరకు స్వాహా బ్యాంకర్లు ఇచ్చిన అధికారంతో బీసీ (బ్యాంక్‌ కరస్పాండెంట్‌) నిర్వాకం లబోదిబోమంటున్న డ్వాక్రా సంఘాల సభ్యులు

యలకుర్రు(పామర్రు): ఓ అనధికార బీసీ (బ్యాంక్‌ కరస్పాండెంట్‌) బుక్‌ కీపర్‌గా విధులు నిర్వహిస్తూ తన చాకచక్యంతో గ్రామానికి చెందిన 31 డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాల జమలను బ్యాంక్‌కు జమ చేయకుండా తన జేబులో వేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో చోటు చేసుకుంది. డ్వాక్రా సంఘాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యలకుర్రు గ్రామంలో సుమారు 31 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నింటికి ఒకే బుక్‌ కీపర్‌ కనకమేడల జ్యోతి ఉంది. ఆమె బీసీగా(బ్యాంక్‌ కరస్పాండెంట్‌) కూడా వ్యవహరిస్తోంది. ఈ గ్రూపులన్నింటికి 2020 వ సంవత్సరం నుంచి సుమారు రూ.5 కోట్ల రుణాన్ని నిడుమోలు గ్రామంలోని యూనియన్‌ బ్యాంక్‌ ద్వారా మంజూరు చేశారు. ఈ రుణానికి సంబంధించి యూనియన్‌ బ్యాంక్‌లో ప్రతి నెలా ప్రతి గ్రూపు జమ చేయవలసి ఉంది. ఎవరైనా రుణాన్ని జమ చేద్దామని బ్యాంక్‌కి వెళ్తే ..మీరు ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు. మీ ఊరులోనే మా బీసీ ఉంది కదా.. ఆమె వద్ద జమ చేయండని, ఇక్కడకు వచ్చి కట్టనవసరం లేదని అప్పటి యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హుకుం జారీ చేశారు. దీంతో మేనేజర్‌ మాటలు నమ్మి గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులు అందరూ తమ రుణ జమలను స్థానికంగా ఉన్న బీసీ వద్దే చెల్లిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ గ్రామంలోని అన్ని ఖాతాలకు కలిపి ఇప్పటివరకు రూ.3కోట్లు మాత్రమే రుణం జమ అయిందని, మిగిలిన డబ్బులు జమ పడలేదని పేర్కొంటూ గ్రామంలోని అన్ని డ్వాక్రా సంఘ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా ఈనెల 3వ తేదీన పామర్రులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఎలకుర్రు గ్రామానికి వెళ్లి వివరాలను సేకరించి తనకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఐకేపీ అధికారులు గ్రామానికి చేరుకుని ఒక్కొక్క గ్రూపు సభ్యులనుంచి గత మూడు రోజులుగా వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

సుమారు రూ.70 లక్షల వరకు స్వాహా?

గ్రామంలో ఉన్న 31 డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి ఒక్కొక్క సంఘం నుంచి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదును బీసీ/బుక్‌ కీపర్‌ బ్యాంక్‌కు జమ చేయలేదని స్థానిక సంఘాల సభ్యులు వాపోతున్నారు. మొత్తం మీద గ్రామ పరిధిలో ఇప్పటి వరకు రూ.70లక్షల వరకు బ్యాంక్‌ లింకేజ్‌ రుణాలకు సంబంధించిన సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, ఇంకా కొన్ని గ్రూపుల వివరాలు తెలియాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామంలోని డ్వాక్రా సంఘాల సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement