● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కై లే అనిల్‌కుమార్
● రిమ్మనపూడి చెరువులో నిబంధనలకు
విరుద్ధంగా రూ.3 కోట్ల మట్టి స్వాహా
రిమ్మనపూడి(పామర్రు): కూటమి నేతల మట్టి దాహానికి అంతులేకుండా పోతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్ నిప్పులు చెరిగారు. రిమ్మనపూడిలో జువ్వనపూడి రాజేంద్ర ప్రసాద్ కుమారుడు శివ పెళ్లి వేడుకలలో పాల్గొనేందుకు గురువారం గ్రామానికి వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి ప్రజలు అనిల్‌కు గ్రామంలోని చెరువులో జరిగిన మట్టి మాఫియాపై వివరించగా వెంటనే నాయకులతో కలిసి చెరువును పరిశీలించారు. అనంతరం అనిల్‌కుమార్ మాట్లాడుతూ పమిడిముక్కల మండలం తాడంకిలో చెరువును అడ్డగోలుగా తవ్విన నేతలు పామర్రు మండలంలోని రిమ్మనపూడి గ్రామంలో అంతకంటే ఎక్కువ స్థాయిలో మట్టి అమ్మకాలు జరిపారని విమర్శించారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
ఒక పద్ధతి ప్రకారం తోలకాలు జరిపాలని కలెక్టర్ స్వయంగా తెలిపినా స్థానిక ఎమ్మెల్యే కుమార్ రాజా అనుచరుడు మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువులోని మట్టిని తొలుత చెరువు గట్లను అభివృద్ధి చేసి, తర్వాత గ్రామంలోని ప్రభుత్వ స్థలాలకు తోలకాలు జరపాలన్నారు. మిగిలిన మట్టిని పంచాయతీలో పాట పెట్టి వేలం పాట వేయించి అధిక మొత్తంలో పాడిన వారికి నిబంధనలకు అనుగుణంగా తోలాలి. అయితే ఒకే లేబుల్‌తో వందలాది ట్రాక్టర్ల్‌తో మట్టిని ఇతర గ్రామాలకు తరలించిన ఘనత కూటమి నేతలకే దక్కుతుందని ధ్వజమెత్తారు. ఒక్కొక్క ట్రాక్టర్‌కు రూ.1,700 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోందన్నారు. చెరువు నుంచి సుమారు 17వేలకు పైగా ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా అమ్మి కూటమి నేతలు సుమారు రూ.3 కోట్ల వరకు గుంజుకుని వారి ఖాతాలో వేసుకున్నారని తెలిపారు.
మట్టి ట్రాక్టర్లతో గ్రామాలు దుమ్ముమయం
వందలాది ట్రాక్టర్లు వెళ్తుండటంతో గ్రామాల్లోని ఇళ్లు వాకిళ్లు మట్టి మయంగా మారాయని వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారని వివరించారు. అక్రమ మట్టి మాఫియాను నిలువరించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారి ఆగడాలకు అడ్డు కట్ట వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్, వైస్ ఎంపీపీ ఆరేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి పెయ్యల రాజు, స్థానికులు నత్తా తోని, శివ తదితరులు పాల్గొన్నారు.


