గన్నవరం: గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తిచేసే లక్ష్యంతో పనులను వేగవంతం చేయాలని ఎయిర్‌పోర్ట్ ఎడ్వైజరీ కమిటీ చైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులకు సూచించారు. స్థానిక విమానాశ్రయంలో గురువారం ఆయన అధ్యక్షతన ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్న ఈ సమావేశంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. విమానాశ్రయంలో ప్రయాణికుల సదుపాయాలు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీస్‌ల విస్తరణ, విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రహదారి అనుసంధానంపై చర్చించారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న షార్జా, సింగపూర్ సర్వీస్‌లతో పాటు భవిష్యత్‌లో శ్రీలంకకు నేరుగా సర్వీస్‌లు నడపాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దుబాయ్ నుంచి ఇక్కడికి ఎమిరేట్స్ విమాన సర్వీస్‌లు కూడా ప్రారంభమైతే అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు సులువైన కనెక్టివిటీ లభిస్తుందన్నారు. దేశీయంగా వారణాసి, ముంబయి, కోల్‌కత, గోవా, కొచ్చిన్‌లకు సర్వీస్‌లను విస్తరించాలని కోరినట్లు తెలిపారు. విమానాశ్రయానికి మెరుగైన రహదారి అనుసంధానం కోసం విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమవుతుందన్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. విమానాశ్రయ విస్తరణ సమస్యల పరిష్కారానికి, భూనిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని యార్లగడ్డ కోరారు. ఎయిర్‌పోర్ట్ నుంచి రామవరప్పాడు వరకు గ్రీనరీ అభివృద్ధి చేయాలన్నారు. విమానాశ్రయ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, ఎయిర్‌పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.


