లింగారెడ్డిపాలెం పీఏసీఎస్ భూముల భద్రతపై ఆందోళన ఫిర్యాదు చేయకుండా అడ్డుకుంటున్నారని రైతుల విమర్శలు ‘సాక్షి’ కథనంతో కదిలిన కో–ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు
కోడూరు: కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని లింగారెడ్డిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) భూముల ఆక్రమణల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. సొసైటీ భూముల కబ్జా వ్యవహారాన్ని ‘కబ్జా కోరల్లో కోట్ల విలువైన భూములు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ కథనం ద్వారా ఆక్రమణలు వెలుగులోకి రావడంతో పీఏసీఎస్ సభ్యులు, అధికారులు ఉలిక్కిపడ్డారు. కబ్జా వ్యవహారంపై సంఘ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆక్రమణదారులకు కొందరు జనసేన పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆక్రమణదారులు జనసేన సానుభూతిపరులే..
సొసైటీ భూములను ఆక్రమించిన వారు జనసేన పార్టీ సానుభూతిపరులేనని గ్రామస్తులు పేర్కొంటున్నారు. లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొందరు జనసేన ముఖ్య నాయకులు ఆక్రమణదారులకు అండగా నిలిచారని రైతులు ఆరోపిస్తున్నారు. సహకార సంఘ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు మౌనం వహించడం, అధికార పార్టీ నాయకులు కబ్జాదారులకు మద్దతు పలకడంపై రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. భూముల ఆక్రమణపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్న సొసైటీ అధికారులను జనసేన నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇప్పించి, వారిని కోర్టుకు పంపి భూములకు బహిరంగ వేలం జరగకుండా ప్రయత్నిస్తున్నారని సమాచారం.
కబ్జా చేసిన స్థలంలో మట్టితో మెరక
లింగారెడ్డిపాలెంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న 12 సెంట్ల భూమిని కబ్జాదారుడు ఆక్రమించి దర్జాగా మట్టితో మెరక చేశాడు. గ్రామ నడిబొడ్డున ఉన్న 20 సెంట్ల స్థలంలోకి ఆక్రమణదారులు స్తంభాలను తీసుకువచ్చి, నిర్మాణ పనులు చేపట్టేందుకు యత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మందపాకలలోని 20 సెంట్లు, గ్రామంలోని మరో ఆరు సెంట్ల భూమిని కూడా కబ్జా చేసేందుకు జనసేన నాయకులు ప్రణాళిక రూపొందించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ, సహకార సంఘ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మార్పులు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి కథనంతో కదిలిన అధికారులు
భూముల ఆక్రమణలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై కృష్ణా కో–ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు స్పందించారు. ఆ భూముల వ్యవహారంపై దృష్టి సారించారు. పీఏసీఎస్ పరిధిలోని భూముల వివరాలపై ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించారు. స్థలాలను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని కోడూరు బ్యాంకు అధికారులను జిల్లా బ్యాంక్ అధికారులు ఆదేశించినట్లు సమాచారం. స్థలాల ఆక్రమణ విషయమై కోడూరు బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో మాట్లాడారు. సొసైటీ ఆధీనంలో ఉన్న భూముల పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. రికార్డులు, యాజమాన్య హక్కులు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


