ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రకృతి సాగుతో నేలతల్లి ఆరోగ్యం బాగుంటుందని.. ఈ సాగు విధానాలతో పాటు సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ధర్తి మాత బచావో అభియాన్ (భూ మాత పరిరక్షణ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికంగా యూరియా వినియోగం జరుగుతున్న 100 గ్రామాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ సరిత, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, జిల్లా సహకార అధికారి అనిత, ఏపీసీఎన్‌ఎఫ్ డీపీఎం శివ ప్రసాద్, పరిశ్రమల శాఖ ఐపీఓ రవి పాల్గొన్నారు.
విజయవాడ కల్చరల్: త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు మధురంగా సాగుతున్నాయి. గురువారం జరిగిన కార్యక్రమంలో వేదాతం పల్లవి, పెందుర్తి విజయలక్ష్మి, కె. యశస్వినీదత్త, చింతలపాటి శ్రీదేవి, రాగంపూడి అమూల్య, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల విద్యార్థినుల బృందగానం, బి. సంహి త, టి. పావనిల గాత్ర యుగళం, సంగీత విద్వాంసులు వేమూరి విశ్వనాఽథ్, బీవీ దుర్గాభవానీలు త్యాగరాజ స్వామి కృతులను పలికించారు. కేఎస్ గోవిందరాజన్, సుసర్ల నందిని శ్రీనివాస్ వీణపై సహకరించారు.
వృద్ధురాలిపై దాడి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మద్యం మత్తులో వృద్ధురాలిపై దాడికి పాల్పడిన యువకుడిపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపాలెంగట్టు క్వారీ ప్రాంతంలో షేక్ మస్తాన్‌బీ(76) ఒంటరిగా నివసిస్తోంది. మస్తాన్ బీ ఇంటి పక్కనే తన మరిది బాజీ కుటుంబం నివాసం ఉంటోంది. బాజీ కుమారుడు మస్తాన్ బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మస్తాన్‌బీ ఇంటి ముందు నిల్చొని నోటికి వచ్చిన బూతులు తిట్టడంతో ఎందుకు తిడుతున్నావు.. ఇంటి లోపలకు వెళ్లవచ్చు కదా అని మందలించింది. దీంతో మస్తాన్ చేతికి అందిన ఇనుప రాడ్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. వెంటనే చుట్టు పక్కల వారు, బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


