అమరావతిని ఎవరో ఆపాల్సిన పనిలేదు! | - | Sakshi
Sakshi News home page

అమరావతిని ఎవరో ఆపాల్సిన పనిలేదు!

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

అమరావతిని ఎవరో ఆపాల్సిన పనిలేదు!

వర్షాలు వస్తే అదే ఆగిపోతుంది విలేకరుల ప్రశ్నకు మాజీ మంత్రి పేర్ని నాని సమాధానం

చిలకలపూడి(మచిలీపట్నం): జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాపాడుకోలేని వారు తాము ఏదో తెచ్చామని చెప్పుకోవటం సిగ్గుచేటని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మచిలీపట్నం నగరానికి పట్టాభి సీతారామయ్య భవన్‌, పోర్టు, మెడికల్‌ కళాశాల తానే తెచ్చానని ఎంపీ బాలశౌరి చెబుతున్నారని ఓ విలేకరిని అడగ్గా.. జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి అహర్నిశలు కష్టపడి కార్యకర్తగా పనిచేసిన వారిని కాపాడుకోలేని, ప్లాన్‌ మంజూరు చేయించలేని ఆయన.. ఇవి ఏ రకంగా తెచ్చానని చెప్పుకుంటున్నారో ప్రజలే గమనించాలన్నారు.

● సమాచారశాఖ మంత్రి పార్థసారథి జగన్‌కు రాష్ట్రంపై విజన్‌ లేదని ఎలా దోచుకుందామా అనే ధ్యాసే ఉందని వ్యాఖ్యానించారని చెప్పగా.. ఆయన సమాధానమిస్తూ మంత్రి పార్థసారథి అద్దె మైకు లాంటివారని ఎద్దేవా చేశారు. పార్థసారథి విజన్‌ ఏంటో ప్రజలకు తెలుసున్నారు.

● తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డీలిమిటేషన్‌లో హైబ్రీడ్‌ మోడల్‌ ప్రతిపాదనపై దక్షిణాది ముఖ్యమంత్రుల కు లేఖ రాశారని జగన్‌ కూడా లేఖ రాస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి ఏ విధంగా చేశారో అదే విధంగా డీలిమిటేషన్‌కు ఓటు వేయవద్దని రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు చెప్పవచ్చు కదా పేర్ని సమాధానమిచ్చారు.

● వైఎస్సార్‌ సీపీ నాయకులు ఎన్ని మొరిగినా అమరావతి నిర్మాణాన్ని ఆపలేరని ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారని అడగ్గా.. పేర్ని నాని మాట్లాడుతూ దానిని ఎవరూ ఆపాల్సి అవసరం లేదని, అమరావతి ప్రాంతంలో రేపు వర్షాలు పడితే అదే ఆగిపోతుందని చెప్పారు.

● వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ మావిగన్‌ అని అంటున్నారని, తాము సీఆర్డీఏలో ఎప్పుడో పెట్టామని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తున్నారన్న ప్రశ్నకు.. పేర్ని నాని సమాధానమిస్తూ అమరావతిలో రాజధాని కోసం 29 గ్రామాలు ఏర్పాటు చేశారన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 23 గ్రామాలకే తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదముద్రలో మాత్రం 29 గ్రామాలకు తెచ్చుకున్నారన్నారు. ఇది దొంగచట్టం అన్నారు. మావిగన్‌ అద్భుతమైన ప్రతిపాదన అని ప్రజలు చెప్పుకుంటున్న నేపథ్యంలో పిల్లిమొగ్గలు వేస్తున్నారన్నారు.

● మంత్రి నారా లోకేష్‌ను టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారని ఓ విలేకరి చెప్పగా.. మరి చంద్రబాబు స్లీపింగ్‌ ప్రెసిడెంటా.. అని వ్యాఖ్యానిస్తూ అమరావతి రాజధాని నిర్మాణంలో మూటలు కట్టుకునే పనిలో ఉండి లోకేష్‌కు అప్పజెప్పినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, వైఎస్సార్‌ సీపీ నాయకుడు చిటికిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement