ఆదిదంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదిదంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్‌

Mar 19 2026 10:24 AM | Updated on Mar 19 2026 10:24 AM

ఆదిదంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్‌ డీ అడిక్షన్‌ సెంటర్‌ను సందర్శించిన ఈగల్‌ ఐజీ ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న మంత్రి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు బుధవారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారు జామున జరిగిన సుప్రభాత సేవలో భక్తులు భారీగా పాల్గొన్నారు. నాలుగు గంటలకు నిర్వహించిన ఖడ్గ మాలార్చనకు 24 టికెట్లను విక్రయించారు. దీంతో రెండు షిఫ్టుల్లో ఈ సేవను నిర్వహించాల్సి వచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో జరిగిన చండీహోమంలో 150 మంది ఉభయ దాతలు ప్రత్యక్షంగా, మరో 50 మంది పరోక్షంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఈ సేవల్లో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): పాత ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్య విభాగంలో ఉన్న డీ అడిక్షన్‌ సెంటర్‌ను ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ బుధవారం సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్‌ నియంత్రణలో ప్రతి తల్లీ ఈగల్‌ బ్రాండ్‌ అంబాసిడరేనని, ఏ చిన్న సమాచారం ఉన్నా ఏపీ ఈగల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపరేషన్‌ ‘సేఫ్‌ క్యాంపస్‌ జోన్‌’లో భాగంగా విద్యార్థుల్లో గంజాయి, డ్రగ్స్‌ వాడకం పై అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్‌ ఎస్పీ నగేష్‌ బాబు, డాక్టర్‌ సామ్రాజ్యం, విజయవాడ ఈగల్‌ సెల్‌ సీఐ రవీంద్ర, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీం ఆర్‌ఐ నాగార్జున, ఎస్‌ఐ వీరాంజనేయులు పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ డి.కె.బాలాజీ పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ కన్వెన్షన్‌ హాలులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఇఫ్తార్‌ విందులో ముస్లింలతో కలిసి వారు ప్రార్థనలు చేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ బండి రామకృష్ణ, పలువురు ముస్లింలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement