అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అందుతున్న ‘మీ కోసం’ అర్జీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ ఎం. నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ శ్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీ కోసం)ను నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 75 అర్జీలను తీసుకున్నారు. తొలుత కలెక్టర్ ప్రజాకవి యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, డీఎంఅండ్‌హెచ్‌వో యుగంధర్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, డీపీవో జె. అరుణ, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, వ్యవసాయ అధికారి పద్మావతి, పౌరసరఫరాల సంస్థ డీఎం శివరాం ప్రసాద్, డీటీడబ్ల్యూవో ఫణిధూర్జటి, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.
అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి
మచిలీపట్నంఅర్బన్: అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) కోరారు. సోమవారం మీ కోసంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ సత్రవపాలెం గ్రామానికి చెందిన (లేటు) బుగ్గల గంటయ్యకు రంగారావు, వీరాస్వామి, నాగేశ్వరరావు ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. గంటయ్యకు చెందిన ఆర్‌ఎస్ నంబర్ 430–3కే లో 0.95 సెంట్ల షెడ్యూల్ ఆస్తి ఉందని, ఆయన ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా మరణించడంతో ఆస్తి ముగ్గురు కుమారులకు వారసత్వంగా వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఆస్తి ఎప్పుడూ విభజన జరగకపోయినా, వీరాస్వామి తనకు పూర్తి హక్కు ఉన్నట్లుగా తప్పుడు వివరాలతో 2025 అక్టోబర్ 3న తన కుమారుడు శివకృష్ణ పేరుపై పార్టిషన్ దస్తావేజును తయారు చేసి, మొగల్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. నిజానికి వీరాస్వామికి ఆస్తిలో కేవలం 1/3 వంతు హక్కు మాత్రమే ఉందని, అయినప్పటికీ మొత్తం 0.95 సెంట్ల భూమి తనదేనన్నట్లు మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కలెక్టర్‌కు వివరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా రిజిస్టరయిన దస్తావేజులను రద్దు చేయడంతో పాటు, బుగ్గల వీరాస్వామి, అతని కుమారుడు శివకృష్ణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
‘మీ కోసం’లో కలెక్టర్ బాలాజీ
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి


