పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులు తొలగించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పరిశ్ర మలు నెలకొల్పేందుకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. తన చాంబర్‌లో వివిధశాఖల అధికారులతో మంగళవారం సాయంత్రంసమావేశం నిర్వహించి పారిశ్రామిక యూనిట్ల పురోగతి, సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పరిశ్రమలను నెలకొల్పటంలో ఉన్న అడ్డంకులను తొలగించి వేగంగా వ్యాపారం జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో మంజూరైన 377 పరిశ్రమలను వెంటనే ఏర్పాటు చేసేందుకు 20 మంది అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి, ఒక్కొక్కరికి 20 మంది పారిశ్రామికవేత్తలను కేటాయించామని పేర్కొన్నారు. ప్రత్యేకాధికా రులు తమ పరిధిలోని ప్రతి పారిశ్రామికవేత్తను నేరుగా సంప్రదించి వారికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములకు సంబంధించి సరిహద్దు సమస్యలు లేకుండా సర్వే నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా, బ్యాంకు రుణాలు అంశాలపై కూడా అధికారులు దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, జిల్లా పరిశ్రమల మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఎల్‌డీఎం రవీంద్రరెడ్డి, డీఎఫ్‌ఓ సునీత, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి పోతురాజు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


