పుస్తకాలకు సమాజాన్ని శాసించే శక్తి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సమాజాన్ని శాసించే శక్తి పుస్తకాలకు ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో సోమవారం సాయంత్రం ఆచార్య గుజ్జు చెన్నారెడ్డి రచించిన ‘ధర్మపురి’ నవలను కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంపై పుస్తకాల ప్రభావం ఉంటుందన్నారు. గుజ్జు చెన్నారెడ్డి నవలను తీసుకురావటం అభినందనీయమన్నారు. రచయిత చెన్నారెడ్డి మాట్లాడుతూ.. బుద్ధుని చరిత్రతో ప్రభావితమై, దానిని ఆధునిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ నవల రాసినట్లు తెలిపారు. ఈగల్ ఎస్పీ నగేష్‌బాబు మాట్లాడుతూ.. మత్తు మందుల్లాంటి ప్రమాదకర వ్యసనాల నుంచి భావితరాలను రక్షించే శక్తి మంచి పుస్తకాలకు ఉందన్నారు. ప్రభుత్వ సహాయ కార్యదర్శి కృష్ణయ్య, పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు మనోహర్ నాయుడు పాల్గొన్నారు.
మినీ కవితా ఉద్యమ సారథి కొల్లూరి
ఎక్స్‌రే పత్రిక సంస్థాపకుడు కొల్లూరి మినీ కవితా ఉద్యమ సారథి అని పలువురు వక్తలు కొనియాడారు. ఎక్స్‌రే పత్రిక, నెలనెలా వెన్నెల కార్యక్రమం ద్వారా మినీ కవితా ఉద్యమానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో కవి, ఎక్స్‌రే పత్రిక సంస్థాపకుడు కొల్లూరి సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి చలపాక ప్రకాష్ అధ్యక్షత వహించారు. సింగంపల్లి అశోక్ కుమార్, బి.ఆంజనేయరాజు, కందికొండ రవికిరణ్, ఉమామహేశ్వరి, శైలజ సామినేని ప్రసంగించారు.
సమాజాన్ని ఆవిష్కరించే సాధనం కవిత్వం
సమాజ వాస్తవ స్వరూపాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే సాధనం కవిత్వమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ‘పాతికేళ్ల కవిత’ అంశంపై చర్చాగోష్ఠిని బీవీ పట్టాభిరామ్ సాహిత్యవేదికపై నిర్వహించారు. రచయిత ఖాదర్ మొహియుద్దీన్, కడలి సత్యనారాయణ, కవి అనిల్ డ్యానీ ప్రసంగించారు. సాహితీ స్రవంతి సత్యాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాధికారి మెరుపుల అజయ్‌కుమార్ పాల్గొన్నారు.


