అమ్మ సన్నిధిలో లెక్కల్లోనే భోజనం | - | Sakshi
Sakshi News home page

అమ్మ సన్నిధిలో లెక్కల్లోనే భోజనం

Aug 11 2025 7:31 AM | Updated on Aug 11 2025 4:56 PM

Devotees receiving Annaprasadam of Goddess Durga (File)

రెండవ ఫ్లోర్ లో దుర్గమ్మ అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు (ఫైల్)

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నదానంలో తిన్నవారికన్నా.. తిన్నట్లు లెక్కలు 

ఎక్కువ రోజుకు సరాసరి వెయ్యికి పైగా భోజనాలను మింగేస్తున్నారు

వేలిముద్రలతో మాయాజాలం 

సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి..

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అన్నదానం (అన్నప్రసాదం) అంటే భక్తులకు విశ్వాసం మెండు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తజనం జగజ్జనని దర్శనానంతరం అన్నప్రసాదం తీసుకునే వెనుదిరుగుతారు. అయితే దేవస్థానంలోని కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు లాలూచీ పడటంతో తిన్నవారికంటే.. లెక్క అధికంగా చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నదానంలో అంకెల మాయ చేస్తూ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మను భక్తులు మనసారా పూజిస్తారు. అందుకే అమ్మవారిని నియమ నిష్టలతో కొలుస్తారు. అయితే ఆలయంలో సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం ఎలాంటి భీతి లేకుండా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానంలోనూ వీరు నిత్యం అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నదానంలో తినేవారి కంటే ఎక్కువ సంఖ్య చూపిస్తూ ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సాధారణ రోజుల్లో..

జనం సాధారణంగా ఉండే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకే అన్న ప్రసాదం భక్తులకు ఇస్తారు. అంటే మొత్తం 4.30 గంటల సమయంలో 14 బ్యాచ్‌లు. బ్యాచ్‌కు 300 మంది చొప్పున 4,200 మందికి మాత్రమే ఉచిత అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆ రోజుల్లో బఫే ఉండదు. అయితే ఈ రోజుల్లో దాదాపు 5000 నుంచి 6000 మంది భక్తులకు భోజనం పెడుతున్నట్లు లెక్క చూపుతున్నారు. సరుకులు దేవస్థానం ఇస్తుండగా, పాలు, కూరగాయలు, గ్యాస్‌, క్లీన్‌అండ్‌ సర్వీసింగ్‌ను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. స్వీపింగ్‌లో 40 మంది సిబ్బంది పనిచేయాల్సిండగా అక్కడ కేవలం 30 మంది మాత్రమే చేస్తున్నారు.

అధికంగా..

ఈ లెక్కన సాధారణ రోజుల్లో 2 వేల మంది, రద్దీ రోజుల్లో వెయ్యి మందిని ఎక్కువగా చూపి చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో భక్తుడికి అన్న ప్రసాదం పెట్టేందుకు దాదాపు రూ.40 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన సరాసరి రోజుకు 1000 నుంచి 1500 మందిని అదనంగా చూపి బిల్లులు పెట్టి దోపిడీ చేస్తున్నారు. రోజుకు రూ.50 వేలకు పైగా దండు కొంటున్నారు. ఇలా నెలకు రూ.15 లక్షల మేర దోపిడీ పర్వం జరుగుతోంది. గత ఏడాది జూన్‌, జూలై, ఈ ఏడాది జూన్‌, జూలై నెలలకు సంబంధించిన అన్నదానం లెక్కలు తీస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది.

సీసీ పుటేజ్‌ను పరిశీలిస్తే..

ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆలయ కార్య నిర్వహణ అధికారి.. అన్నదానం పెట్టే ప్రాంతంలో జూన్‌, జూలై నెలల్లో సీసీ పుటేజీని పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఏ సయమంలో భక్తులకు అన్నదానం ప్రారంభిం చింది, క్లోజ్‌ అయిన విషయాలు స్పష్టంగా ఉంటాయి. ఒక్క రోజు పరిశీలిస్తే ఎన్ని బ్యాచ్‌లకు భోజనాలు పెట్టింది తెలుస్తుంది. అక్కడ భోజనాలు చేసే ముందు వేసే వేలి ముద్రల్లో సిబ్బంది మాయ చేస్తున్నారని సమాచారం. సీసీ పుటేజీలు పరిశీలిస్తే అన్నదానంలో జరిగే దందా మొత్తం బయటికి వస్తుంది. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

దోపిడీ చేస్తున్నారిలా...

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉచిత అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు పెడతారు. మూడో ఫ్లోర్‌ నుంచి క్యూలైన్‌ మొదలవుతుంది. రెండో ఫ్లోర్‌లో భక్తులకు ఒక హాలులో 180మంది, ఇంకో హాలులో 120 మందికి రెండు హాళ్లల్లో 300 మందికి ఒకేసారి భోజనం పెడతారు. ఒక్కో బ్యాచ్‌ భోజనం చేసేందుకు 20 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన 6 గంటల సమయంలో 18 బ్యాచ్‌లు అంటే అత్యధికంగా 5,400 మందికి భోజనం పెట్టే వెసులుబాటు ఉంది. ఈ రోజుల్లో ఫస్ట్‌ ఫ్లోర్‌లో దాదాపు 1500 మందికి బఫే పద్ధతిలో పెడతారు. అంటే అత్యఽధికంగా 7000 మందికి భోజనం పెట్టే వీలుంది. బఫే బ్యాచ్‌ భోజనం 10 నుంచి 13 నిమిషాల్లోనే పూర్తైనట్లు చూపి, రోజుకు 8000 నుంచి 9000 మందికి భోజనం పెడు తున్నట్లు లెక్క చూపుతున్నారని సమాచారం. ఎక్కువగా చూపిన భక్తుల సంఖ్యకు సంబంధించిన లెక్కను ఆలయ అన్నదాన సిబ్బంది, క్లీన్‌ అండ్‌ సర్వీంగ్‌ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చేతివాటంలో అన్నదానానికి సంబంధించి ఇద్దరు గుమాస్తాలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Vijaywada Durga Temple1
1/1

విజయవాడ దుర్గ గుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement