
పాపం.. పసుపు రైతు!
కంకిపాడు: బహిరంగ మార్కెట్‌లో జరుగుతున్న మాయాజాలానికి పసుపు రైతులు నలిగిపోతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను స్థిరంగా ఉంచుతున్నారు. సన్నకొమ్ములు, పుచ్చులు కనిపిస్తున్నాయంటూ ధరను తగ్గించి అన్నదాతలను లూటీ చేస్తున్నారు. గత రెండు సీజన్‌లలో ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది కూడా గరిష్ట ధర దక్కుతుందనే ఆశలో అన్నదాతలు ఉన్నారు. దీనికి తోడు పంటను నిల్వ చేసుకునే సన్నాహాల్లో ఉన్నారు.
కష్ట, నష్టాలకోర్చి సాగు..
ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు ఒకటి. దీన్ని ఈ ప్రాంత రైతాంగం పచ్చబంగారంగా పిలుస్తారు. ఈ సీజన్‌లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 5,031 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లో పంటను సాగు చేశారు. ప్రధానంగా కడప మైదుకూరు, ప్రగతి, శీలం, ఇతర స్థానిక విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నారు. ఎకరాకు రూ.1.70 లక్షలు వరకూ పెట్టుబడులు పెట్టారు. భారీ వర్షాలు, వరదలతో సాగు ఆరంభంలో పంటకు నష్టం జరిగింది. ఆటు పోట్లను అధిగమించి రైతులు పంటను సంరక్షించుకున్నారు. వర్షాల కారణంగా అక్కడక్కడా దుంప పుచ్చు ఆశించింది. పచ్చి పసుపు 60–70 పుట్టు (పుట్టు అంటే 225 కిలోలు) వరకూ దిగుబడి వచ్చింది. ఉడకబెట్టి, ఎండబెట్టిన పిదప 22 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 26 క్వింటాళ్ల వరకూ దిగుబడులు చేతికందాయి.
సిండికేట్‌తో రైతులకు కష్టాలు..
ఈ ఏడాది పంట చేతికొచ్చిన మార్చి, ఏప్రిల్ నెలల్లో క్వింటా పసుపు కొమ్ములు రూ. 9,100 పలికింది. ఇంకా ధర పెరుగుతుందని అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. రూ. 11,500 వరకూ చేరింది. అయితే గడిచిన 20 రోజులుగా క్వింటా పసుపు కొమ్ముల ధర రూ. 11వేల మీదే నిలిచిపోయింది. ధర పెరగకుండా వ్యాపారుల సిండికేట్ అడ్డు పడుతోందని రైతులు భావిస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంట నాణ్యత దెబ్బతినటం, ఊట సరిగా ఊరకపోవటంతో కొమ్ములు నాణ్యంగా ఉన్నప్పటికీ సైజు సన్నగా ఉండటాన్ని వ్యాపారులు సాకుగా మార్చుకున్నారు. అక్కడక్కడా పుచ్చు, కొమ్ములు సన్నంగా ఉన్నాయని ధరను తగ్గించేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా మార్చుకుని ధర నిర్ణయం చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. సన్నం, పుచ్చు నెపంతో క్వింటా రూ. 9వేల నుంచి రూ. 11వేల లోపు చెల్లిస్తూ అన్నదాతను నిట్టనిలుపునా ముంచేస్తూ వ్యాపారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు బహిరంగ మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.
సిండికేట్ అయి కొను‘గోలుమాల్’ నాసిరకం పేరుతో ధర తగ్గింపు రూ. 9వేల నుంచి రూ. 11వేలు పలుకుతున్న ధర 20 రోజులుగా ధరను స్థిరంగా ఉంచుతున్న వైనం ధర పెరుగుతుందనే ఆశలో అన్నదాతలు పంటను నిల్వ చేసుకునేందుకు సన్నాహాలు
ధర పెరగకుండా వ్యాపారుల మాయాజాలం