
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
స్కానింగ్ సెంటర్లకు కలెక్టర్
లక్ష్మీశ హెచ్చరిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ–పీఎన్‌డీటీ) చట్టాన్ని ఉల్లంఘిస్తే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్‌టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎ.సత్యానంద్ హాజరయ్యారు.
ప్రజల్లో అవగాహన కల్పించాలి..
సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టంలోని నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఉన్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించిన తొమ్మిది దరఖాస్తులను, మూడు రెన్యువల్ దరఖాస్తులను, నాలుగు క్యాన్సిలేషన్ దరఖాస్తులను కమిటీ పరిశీలించి, చర్చించి, ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏఆర్‌టీ లెవెల్–1 కేటగిరీకి సంబంధించిన రెండు దరఖా స్తులు, ఏఆర్‌టీ లెవెల్–2 కేటగిరీకి సంబంధించిన రెండు దరఖాస్తులతో పాటు సరోగసీ క్లినిక్‌కు సంబంధించి ఒక దరఖాస్తుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ పాల్గొన్నారు.