చిలకలపూడి(మచిలీపట్నం): యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ కోరారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ సమావేశమై చర్చించారు. ఆమె మాట్లాడుతూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజున విశాఖపట్నం సముద్రం ఒడ్డున రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని, ఆ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు మే 21వ తేదీ నుంచి జూన్ 21 వరకు యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని నగరంలో నిర్వహిస్తున్నామని, బుధవారం ఉదయం నగరంలో ర్యాలీ, అనంతరం బ్యాడ్మింటన్ కోర్టు ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం ప్రారంభిస్తామని, ముగింపు కార్యక్రమం మంగినపూడి బీచ్ లేదా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తామన్నారు. ఆ ప్రకారం కార్యక్రమం సజావుగా నిర్వహించేలా సమన్వయం చేసుకుంటూ సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమం ఇలా..
డీఆర్‌ఓ కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఉదయం 6.30 గంటలకు నగరంలోని సాయిబాబా గుడి నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కోర్టు సమీపంలోని బ్యాడ్మింటన్ కోర్టు ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ర్యాలీకి సంబంధించిన జెండాలు, బ్యానర్లు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కె.ఆర్.ఆర్.సి డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీ లక్ష్మి, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ