
మందులకు ఎండదెబ్బ!
బీపీ, సుగర్ పేషెంట్లూ జరభద్రం!
● అధిక ఉష్ణోగ్రతలో మందులు ఉంచితే పనిచేయవు ● ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలి ● రోజూ వాడే మందులకు తగిన ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలంటున్న నిపుణులు ● ఎప్పటికప్పుడు లెవెల్స్ తనిఖీ చేసుకోవాలని సూచనలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నప్పటికీ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. బయటకు రావడం అలా ఉంచితే ఉక్కపోతతో ఇళ్లలోనే ఉండలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో వేసవిలో కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే వారు ఎక్కువే. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులపై పడి, పనిచేయ కుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మందుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎండల తీవ్రత ఎక్కువే..
ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మే రెండో వారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రభావం గదిలోపల కూడా కనిపిస్తోంది. సాధారణంగా గదిలోపల ఉష్ణోగ్రత 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇది కాస్త ఎండ దెబ్బకి 32 డిగ్రీల సెల్సీయస్ దాటిపోతుంది. ఆరు బయట ఈ ఏడాది 40 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదు కావచ్చంటున్నారు. ఈ తరుణంలో అద్దాలు మూసి ఉంచిన కారు, వ్యానుల్లో రెండింతలు, మూడింతలు వరకూ ఉండవచ్చు. మండుతున్న ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక మందుల పనితీరుపై ప్రభావం చూపి సుగర్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రస్ఫుటంగా కనిపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందుల భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలో ఉంచిన మందులు వాడటం వల్ల వ్యాధులు అదుపులో ఉండవని చెబుతున్నారు.
● మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక మందులు సాధారణంగా 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాలి. ముఖ్యంగా జానుమెట్, జార్డియాన్స్, కొమ్బిగ్‌లెజా, సిటాగ్లిఫ్టిన్ కార్దేస్, ఆటర్వాస్టాటిన్, రాబెప్రజోల్, మేకోబాలమిన్ వంటి మందులు 30 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు, అమరిల్, విల్దాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్, సారోగ్జిటజార ఆమ్లోడిపిన్, క్లిన్ దపిన్, విటమిన్ ఈ, డీ మందులు 25 డిగ్రీలలోపు భద్రపర్చాలి.
● ఇన్సులిన్ మందు గుడ్డులో ఉండే ప్రోటీన్ వంటిదే. కొద్దిసేపు అధిక వేడిమికి గురైన గుడ్డు ఉడికినట్లు, ఇన్సులిన్ కూడా అదే విధంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండలో ఉంచి తర్వాత ప్రిడ్జ్ వంటి వాటిలో ఉంచి వాడినా ప్రయోజనం ఉండదని సూచిస్తున్నారు. మందులు కొనుగోలు చేసే సమయంలోనే నిర్ధిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న మందుల షాపుల్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
● రిఫ్రిజిరేటర్‌లు లేని వారు మట్టికుండలో నీళ్లు పోసి, దానిలో ఇన్సులిన్‌ను భద్రపరుచుకోవచ్చు.
ఇన్సులిన్ వాడుకునే వాళ్లు బాటిల్స్, ఇన్సులిన్ పెన్‌లను ఐస్‌బాక్స్, ఐస్ ఉన్న ప్లాస్కోలో ఉంచాలి. ఇన్సులిన్ స్టాక్‌ను ఫ్రిడ్జ్ డోర్ అడుగు భాగంలో పెట్టుకోవాలి. డీప్ ఫ్రీజర్‌లో ఉంచకూడదు. అనుకోకుండా సుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే వేడికి ఇన్సులిన్ సరిగా పనిచేయక పోవడమే కారణమని అని భావించాలి. వేసవిలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. బయటకు వెళ్లేటప్పుడు గ్లూకోజ్ టెస్ట్‌స్ట్రిప్స్, మందులు సరిపడా తీసుకు వెళ్లడమే కాకుండా, సరైన ఉష్ణోగ్రతలో వాటిని ఉంచాలి.
– డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి,
మధుమేహ నిపుణుడు, విజయవాడ
సరైన ఉష్ణోగ్రతలో ఉంచాలి..
ఇలా
భద్రపరచాలి..

మందులకు ఎండదెబ్బ!

మందులకు ఎండదెబ్బ!