వట్టివాగు ప్రాజెక్టుకు రెండు ప్రధాన కాలువలతోపాటు 18 పిల్ల కాలువలు ఉన్నాయి. ఇందులో కుడి కాలువ 21 కిలోమీటర్లు, ఎడమ కాలువ 7 కిలోమీటర్ల మేరకు ఉంది. ప్రధాన కాలువలతోపాటు పిల్ల కాలువల్లోనూ పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రస్తుతం రెండు పొక్లేన్లతో డీ–6, డీ–8, డీ–10 పిల్ల కాలువల్లో నాలుగు రోజుల క్రితం పూడికతీత పనులను ప్రారంభించారు. ప్రధాన కాలువలో పూడిక తీయాలంటే పెద్ద యంత్రాలు అవసరం అవుతాయి. కానీ ప్రస్తుతం చిన్న కాలువల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏప్రిల్, మే నెలల్లోనే ప్రారంభించి ఉంటే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తయ్యే అవకాశం ఉండేది. ప్రస్తుతం వర్షాలు మొదలవడంతో పాటు వరినార్లు పోసుకునే సమయం ఆసన్నమవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.


