వానల్లో పూడికతీత | - | Sakshi
Sakshi News home page

వానల్లో పూడికతీత

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

ప్రాజెక్టు కాలువల మరమ్మతుకు రూ.50 లక్షలు మంజూరు ఆలస్యంగా పనులు ప్రారంభం వరినార్లు పోసేందుకు సిద్ధమవుతున్న ఆయకట్టు రైతులు పూర్థిస్థాయిలో పొలాలకు సాగునీరందడం కష్టమే..

ఆసిఫాబాద్‌రూరల్‌: వట్టివాగు ప్రాజెక్టు కాలువ పూడికతీత పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యా యి. ఓ వైపు రైతులు సాగుకు సిద్ధమవుతుండగా, వర్షాలు పడుతున్న సమయంలో పూడికతీయడంపై విమర్శలు వస్తున్నాయి. సకాలంలో పనులు పూర్తవుతాయా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2001 వట్టివాగు ప్రాజెక్టును రెండు ప్రధాన కాలువలు, 18 పిల్ల కాలువలతో నిర్మించారు. 2.98 టీఎంసీల నీటి సామర్థ్యంతో 27 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. అయితే ప్రాజెక్టు ప్రారంభమై 20 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం రైతులకు శాపంగా మారింది. 2025 నవంబర్‌లో కాలువల పూడికతీత కోసం ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. అధికారులు నాలుగు రోజుల క్రితం పనులను ప్రారంభించారు. వర్షాకాలంలో ప నులు ప్రారంభించడంతో సక్రమంగా ముందుకు సాగడం లేదు. కాలువల్లో వరద చేరి బురదమయంగా మారడంతో పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ మొదలుకావడంతో ఈ పనులు ఎంతవరకు జరుగుతాయి? పూర్తి స్థాయిలో పూర్తవుతాయా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈసారి కూడా రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవని స్పష్టమవుతోంది.

రైతులకు తప్పని ఇబ్బందులు

ప్రాజెక్టు నీటి సామర్థ్యం ప్రకారం 27 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు దిగువన కేవలం 1200 నుంచి 1400 ఎకరాల్లో మాత్రమే వరి సాగవుతోంది. 20 ఏళ్లుగా అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో కాలువలకు మ రమ్మతులు చేపట్టలేదు. ప్రాజెక్టులో నీరున్నా భూ ములకు అందలేని దుస్థితి నెలకొంది. కాలువలు సిమెంట్‌ లైనింగ్‌ కోల్పోయి పూర్తిగా పూడికతో నిండిపోయాయి. పిచ్చిమొక్కలు, తుంగ పెరిగి శిథిలా వస్థకు చేరాయి. సాగునీటిని విడుదల చేసినా అది పొలాలకు చేరడం లేదు. సగంలోనే గండ్లు పడటం ప్రధాన సమస్యగా మారింది. ప్రతీ సంవత్సరం రైతులు తమ సొంత డబ్బులతో జేసీబీలను అద్దెకు తెచ్చుకుని కాలువలను సరిచేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కాలువలకు దిగువన ఉన్న రైతులు మాత్రమే వరి పంట సాగు చేస్తుండగా, మిగతా రైతులు పత్తి, కంది వంటి ఇతర ప్రత్యామ్నాయ పంటలను పండిస్తున్నారు.

పనులు కొనసాగుతున్నాయి

కాలువల పూడికతీత కోసం మంజూరైన రూ.50 లక్షలతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. వర్షాలతో ఇప్పుడు సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తాం. మిగతా పనులను వచ్చే సంవత్సరం చేపట్టాల్సి వస్తుంది. ఈసారికి 50 శాతం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

– పవన్‌ కల్యాణ్‌, ప్రాజెక్టు ఏఈఈ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement