సర్పాల భయం..! | - | Sakshi
Sakshi News home page

సర్పాల భయం..!

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

వర్షాల రాకతో పాముకాట్లు పెరిగే అవకాశం ఇటీవల జిల్లాలో ఒకరు మృతి రైతులకు పొంచి ఉన్న ముప్పు నాటువైద్యంతో ప్రాణాలకే ప్రమాదం

ధాన్యపు గుమ్మిలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి. తడిగా ఉండే చోట కప్పలు చేరుతాయి. వాటిని ఆహారంగా తినే పా ములు ఆయాచోట్లకు వచ్చే అవకాశం ఎక్కువ.

దుంగలు, కట్టెలు కదిలించినప్పుడు వాటి మధ్యలో నక్కి ఉండే పాములు, తేళ్లు కాటు వేస్తాయి.

రాత్రిపూట పొలాల్లో మోటారు వేయడాని కి, కాపలా ఉండటానికి, సాగునీరు పెట్ట డానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్‌ ఉపయోగించాలి. మోటార్‌ లోపల, స్టార్టర్‌ డబ్బా, చీకటి ప్రదేశాల్లో పాములు ఉండవచ్చు.

పొలంగట్ల వెంబడి నడిచేటప్పుడు కర్రతో చప్పుడు చేయాలి. కాళ్లకు రక్షణగా బూట్లు వేసుకుంటే పాముకాటు ప్రమాదం తప్పుతుంది.

పాములు చేరడానికి అవకాశం లేకుండా ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

కౌటాల: వర్షాకాలం ప్రారంభంతో జిల్లాలో పాముకాట్ల భయం మళ్లీ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లికి చెందిన బొమ్మెళ్ల సత్తయ్య(63) అనే వృద్ధుడు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయా డు. ఈ నెల 21న రాత్రి ఇంటి ఆవరణలో నేలపై నిద్రిస్తున్న సమయంలో ఆయనను పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా సోమవారం వేకువజామున మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. జిల్లా ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడుతుంటారు. ఆధునిక కాలంలోనూ పాముకాటు మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వర్షాలకు భూమి పొరల్లో ఉండే క్రిమికీటకాలు, పాములు బయటకు వస్తున్నాయి. చల్ల దనం, భద్రత కోసం ఇళ్ల పరిసరాలకు చేరుతుంటాయి. మనుషులు, పశువులను కాటేస్తున్నాయి.

నాటువైద్యంతోనే ముప్పు

మారుమూల గ్రామాల్లోని చాలామంది ప్రజలకు ఇప్పటికీ పాముకాటుపై సరైన అవగాహన లేదు. గిరిజనులు, గ్రామీణ ప్రజలు నాటు వైద్యాన్ని నమ్ముకోవడం ప్రమాదకరంగా మారుతోంది. పాము కరిచినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాల మీదికి వస్తోంది. పాముకాటుకు విరుగుడుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ స్నేక్‌ వీనమ్‌ టీకాలు అందుబాటులో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో సరైన సమయానికి చికిత్స అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పాము తన ఆత్మరక్షణ కోసం విధిలేని పరిస్థితుల్లో మాత్రమే మనుషులను కాటు వేస్తుంది. ఒకవేళ పాము కరిస్తే తక్షణమే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం ఉత్తమం.

కొన్ని పాములతోనే ప్రమాదం

నిజానికి అన్ని పాముల్లోనూ విషం ఉండదు. త్రాచు, కట్లపాము వంటి కేవలం 15 శాతం సర్పజాతులతోనే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషం లేని, ప్రమాదకరం కాని మామూలు గాయాలే. వీటికి సాధారణ చికిత్స అందిస్తే సరిపోతుంది. అయితే పాము కాటు వేయగానే చాలా మంది తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. ఆ పాముకు విషం లేకపోయినా షాక్‌తో చనిపోయే ప్రమాదం ఉంది. బాధితుడికి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పాలి.

జాగ్రత్తలు తప్పనిసరి

ఆస్పత్రుల్లో యాంటీ వీనమ్‌

వర్షాకాలంలో రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో తరచూ పాము, తేలు కాటుకు గురవుతుంటారు. బాధితులకు గాయమైన చోట వెంటనే సబ్బుతో శుభ్రంగా కడగాలి. అనంతరం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ స్నేక్‌ వీనమ్‌ అందుబాటులో ఉంచాం. పాముకాటు వేసిన వారికి నాటువైద్యం అందిస్తే ప్రాణాలకే ప్రమాదం. త్వరలోనే పాము, తేలు కాట్లపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తాం.

– సీతారాం, డీఎంహెచ్‌వో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement