ఆసిఫాబాద్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతి రేక దినాన్ని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి గాంధీ చౌక్ మీదుగా అంబేడ్కర్ చౌక్ నుంచి తిరిగి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు విద్యార్థులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల మీదుగా అంబేడ్కర్ చౌక్ చేరుకుని మానవహారం చేపట్టారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాయని, ప్రతిఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజాన్ని చైతన్యపర్చడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. యువతను మత్తు పదార్థాల నుంచి కాపాడేందుకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. అనంతరం ‘వాల్ ఆఫ్ ప్రామిస్’పై ఎస్పీతోపాటు పోలీసు అధికారులు, విద్యార్థులు, డ్రగ్స్ నిరోధక సందేశాలు రాసి సంతకాలు చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


