జిల్లాలో మొదలైన సాగు సందడి విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం కీలకం వర్షాభావ పరిస్థితులపై దృష్టి సారిస్తే మేలు
చింతలమానెపల్లి: వర్షాల రాకతో జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. 4.38 లక్షల ఎకరాల సాగుభూమి కలిగిన జిల్లాలో అధికశాతం వర్షాధారంగానే పంటలు సాగు చేస్తారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. పరిమితికి మించి రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించుకుంటే ఖర్చులు తగ్గి రైతులపై పెట్టుబడి భారం ఉండదు. అలాగే తక్కువ నీటి వినియోగం ఉండే విత్తనాల ఎంపిక కూడా కీలకంగా మారుతుంది. జిల్లాలో పెద్దవాగు, ప్రాణహిత, పెన్‌గంగ, వట్టివాగు వంటి నదులు, వాగులు ఉన్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాణహిత, పెన్‌గంగ నదులపై ఏడు ఎత్తిపోతల పథకాలు ఉన్నా వీటిలో సాండ్‌గాం ఎత్తిపోతల పథకం పరిధిలో మాత్రమే సాగు నీరందుతోంది. జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు, అడ, వట్టివాగు ప్రాజెక్టుల ఆయకట్టు కింద సాగు తక్కువే. ఈ నేపథ్యంలో అన్నదాతలు అప్రమత్తతతో ఉంటే నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.
విత్తన ఎంపికే కీలకం
జిల్లాలో ఏటా రైతులు వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. ఒకసారి వర్షాభావ పరిస్థితులు, మరో ఏడాది అధిక వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన పంటలైన వరి, పత్తిలో రైతులు సరైన విత్తన రకాలు, వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటి వినియోగం ఉండే వాటిని ఎంచుకోవా లి. స్వల్ప, మధ్య కాలిక రకాలను సాగు చేయాలి. జిల్లాలోని పత్తి చేలు చాలా వరకు నీటి వసతికి దూ రంగా, అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులను సైతం తట్టుకునే మేలు రకం బీటీ విత్తనాలు విత్తుకోవాలి. అంతర పంటగా కంది, పెసర సాగు చేస్తే ఒక పంట దెబ్బతిన్నా మరొకటి చేతికందుతుంది. అంతర పంటలతో భూసారం పెరగడంతోపాటు అదనపు ఆదాయం వస్తుంది. ఎల్‌నినో నేపథ్యంలో వర్షపు నీటిని సక్రమంగా వినియోగించడం కీలకం. నీటిని పొలంలోనే ఇంకేలా చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ గట్లు వేయడం, పత్తి చేనులో బోదె సాలు పద్ధతి పాటిస్తే తేమ ఎక్కువ రోజులు ఉంటుంది.
ఎరువుల వినియోగంపై దృష్టి
సాధారణంగా రైతులు అవసరానికి మించి ఎరువులను వినియోగిస్తుంటారు. యూరియా, డీఏపీ అధి కంగా వాడితే పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు చీడపీడలు ఆశిస్తాయి. వీటి స్థానంలో సహజ ఎరువులను వినియోగిస్తే ఖర్చు తగ్గుతుంది. నేలతో తేమశాతం తగ్గకుండా ఉంటుంది. విత్తనాలు వేయడానికి ముందే జీలుగ, జనుము లాంటి పచ్చిరొట్ట సాగు చేసి భూమిలో కలియదున్నాలి. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ వినియోగించాలి. ఆవుపేడ, మూత్రంతో తయారయ్యే జీవామృతం వినియోగి స్తే మిత్ర పురుగులు పెరిగి పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఖరీదైన రసాయన పురుగు మందుల వినియోగం తగ్గించాలి. లింగాకర్షక బుట్టలు, పసుపురంగు జిగురు అట్టలు ఎకరా నికి 4 నుంచి 5 చొప్పున అమర్చితే రెక్కల పురుగులు, రసం పీల్చే పురుగులను ప్రాథమిక దశలోనే నివారించవచ్చు. పురుగుల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వేపనూనె పిచికారీ చేస్తే ఇది పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది.
జిల్లాలో వర్షపాతం వివరాలు (జూన్ 1 నుంచి 25 వరకు)
కురవాల్సింది 148.6 మి.మీ.
కురిసింది 114.9 మి.మీ.
వ్యత్యాసం – 23శాతం లోటు
లోటు వర్షపాతం ఉన్న మండలాలు
రెబ్బెన – 34శాతం
చింతలమానెపల్లి – 35శాతం
పెంచికల్‌పేట్ – 47 శాతం
తీవ్ర లోటు ఉన్న మండలాలు
వాంకిడి – 61శాతం
కాగజ్‌నగర్ – 60శాతం
బెజ్జూర్ – 81శాతం
దహెగాం – 62 శాతం
అవగాహన కల్పించాలి
వాతావరణ పరిస్థితులను గమనించకుండా సాగు చేయడంతో అనుకున్న దిగుబడి రాలేదు. పంట చేతికందే దశలో వర్షాలతో నష్టపోయాను. ఈ ఏడాది కరువు వస్తుందని అంటున్నారు. వర్షాలు తక్కువగా ఉంటే పంటలను కాపాడుకోవడం ఎలా అనేదానిపై అధికారులు అవగాహన కల్పించాలి.
– గుర్లె సత్తయ్య, రుద్రాపూర్
సలహాలు పాటించాలి
రైతులు అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటాలి. దీని ద్వారా దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తేమను కాపాడుకునే చర్యలు చేపట్టాలి. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి, దిగుబడులు సాధించడానికి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి.
– వెంకట్, జిల్లా వ్యవసాయ అధికారి


