ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) సర్వే గురువారం నుంచి జిల్లాలో ప్రారంభమైంది. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని మ్యాపింగ్ చేపడుతున్నారు. తొలిరోజు పెంచికల్‌పేట్ మండలంలో కలెక్టర్ కె.హరిత హాజరై సిబ్బందికి సూచనలు చేశారు. వాంకిడి మండలం నవేగాంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ ఆకాష్ మెంగ్రె, వైస్ చైర్మెన్ ఎండీ అహ్మద్ పర్యవేక్షించారు. అయితే కెరమెరి మండలంలోని వివాదాస్పద సరిహద్దు గ్రామ పంచాయతీల్లో సర్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అంతాపూర్, భోలాపటార్ పంచాయతీల పరిధిలో కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోగా, పరంధోళి, ముకదంగూడ పంచాయతీలోని వారు మాత్రం వివరాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కుమురంభీం ఆసిఫాబాద్, చంద్రాపూర్ జిల్లాల కలెక్టర్లు గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పకడ్బందీగా చేపట్టాలి
పెంచికల్‌పేట్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పకడ్వందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. పెంచికల్‌పేట్ మండలంలోని చేడ్వాయి, బొంబాయిగూడ, ఎల్కపల్లి గ్రామాల్లో సర్వేను గురువారం పరిశీలించారు. ప్రతీ ఇంటికి తిరుగుతూ అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలన్నా రు. బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు సమన్వయంతో సర్వే తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఎల్కపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాదారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


