చినుకులకే దారిద్రం..! | - | Sakshi
Sakshi News home page

చినుకులకే దారిద్రం..!

Jun 25 2026 1:12 AM | Updated on Jun 25 2026 1:12 AM

కోత్మీర్‌– దహెగాం డబుల్‌ రోడ్డు పనులతో చిత్తడిగా రోడ్డు పెంచికల్‌పేట్‌ మీదుగా పూర్తికాని అప్రోచ్‌ బురదలో కూరుకుపోతున్న వాహనాలు దహెగాం మండలానికి మూసుకుపోతున్న దారులు

దహెగాం: దహెగాం మండలానికి దారులు మూసుకుపోతున్నాయి. రహదారులు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉండగా, చినుకులకే బురదమయంగా మారి రాకపోకలు కష్టతరంగా మారుతున్నాయి. కోత్మీర్‌ నుంచి దహెగాం వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి పనులు కొనసాగుతున్నాయి. అలాగే దహెగాం– పెంచికల్‌పేట్‌ మండలాల మధ్యలోని లగ్గాం సమీపంలో మరో వంతెన పనులు చేపడుతున్నారు. ప్రస్తుత వర్షాలకు మట్టిరోడ్లు బురదమయంగా మారుతున్నాయి. భారీ వర్షాలు పడితే మండలానికి రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు వరదలు పోటెత్తి పెద్దవాగు ఉప్పొంగడంతో కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై వంతెన కుంగికూలిపోయింది. అప్పుడు దహెగాం, భీమిని, కాగజ్‌నగర్‌ మండలాల ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. పెద్దవాగు వంతెన నిర్మాణం పూర్తికావడంతో కొంత రవాణా కష్టాలు తీరాయి.

చిత్తడిగా డబుల్‌ రోడ్డు

కోత్మీర్‌ నుంచి దహెగాం వరకు సింగిల్‌ రోడ్డు ఉండగా రెండున్నర ఏళ్ల క్రితం ప్రభుత్వం డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.32 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌ ఆలస్యంగా పనులు ప్రారంభించి మొదట కల్వర్టులు నిర్మించాడు. అనంతరం అంతరాయం ఏర్పడటంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు స్పందించి పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మట్టి పనులు కొనసాగుతుండగా వర్షాలకు రోడ్డంతా చిత్తడిగా మారుతోంది. వాహనాలు బురదలో ముందుకు కదలడం లేదు.

వర్షాలకు చిత్తడిగా మారిన డబుల్‌ రోడ్డు

పెంచికల్‌పేట్‌ మీదుగా అదే దుస్థితి

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దహెగాం మండల ప్రజలు కొందరు కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ పట్టణానికి అవసరాల నిమిత్తం పెంచికల్‌పేట్‌ మీదుగా వెళ్తున్నారు. అయితే లగ్గాం సమీపంలో చిన్న వంతెన వద్ద మరో ఎత్తు వంతెన పనులు కొనసాగుతున్నాయి. పెద్దవాగుపై నిర్మాణం పూర్తయిన వంతెన వద్ద రెండు వైపుల అప్రోచ్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మట్టి పోసి వదిలేయగా, ప్రజలు తాత్కాలికంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒర్రైపె వంతెన నిర్మాణం, 400 మీటర్ల అప్రోచ్‌ రోడ్డుకు గతేడాది సీఆర్‌ఐఎఫ్‌(సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) కేంద్రం నుంచి రూ.18 కోట్లు మంజూరు చేసింది. పాత రోడ్డు బురదగా మారుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement