అపోహలొద్దు.. సురక్షితమే! | - | Sakshi
Sakshi News home page

అపోహలొద్దు.. సురక్షితమే!

Jun 25 2026 1:12 AM | Updated on Jun 25 2026 1:12 AM

మార్చి 8న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

అవగాహన లేక ముందుకురాని బాలికలు

నాలుగు నెలల్లో 786 మందికి మాత్రమే వ్యాక్సిన్లు

విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో వేగం పెంచాల్సిందే..

వాంకిడి: గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకాల పంపిణీ వేగం పుంజుకోవడం లేదు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని ప్ర భుత్వ ఆస్పత్రుల్లో బాలికలకు ఉచితంగా అందించేందుకు వైద్యారోగ్యశాఖ కార్యాచరణ రూపొందించినా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. 24 ఆరోగ్య కేంద్రాలలో టీకాలు అందుబాటులో ఉంచి, వైద్యారోగ్య శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా బాలికలు ముందుకు రా వడం లేదు. మార్చిలో వార్షిక పరీక్షల నేపథ్యంలో బాలికలు ముందుకురావడం లేదని అధికారులు భావించారు. వేసవి సెలవుల్లో లక్ష్యాన్ని చేరుకోవచ్చని అనుకున్నా పరిస్థితి మెరుగుపడలేదు. విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలపై దృష్టి సారిస్తేనే లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది.

786 మందికే టీకా..

జిల్లాలోని వసతి గృహాలు, ఉన్నత పాఠశాలలు, అంగన్‌వాడీల రికార్డుల ప్రకారం జిల్లాలో 14–15 ఏళ్ల వయస్సు గల బాలికలు 3980 మంది ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించిన సందర్భాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా హెచ్‌పీవీ టీకాలపై అవగాహన కల్పిస్తున్నారు. నాలుగు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు 786 మంది బాలికలు మాత్రమే టీకా వేయించుకున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 20 శాతం మాత్రమే ముందుకువచ్చారు. బాలికల్లో సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. తల్లిదండ్రుల్లో వ్యాక్సిన్‌పై అపోహాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఉచితంగా అందిస్తున్నా..

మహిళలల్లో ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్‌ నిరోధించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. కిశోర బాలికలు ముందస్తుగా ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇదే వ్యాక్సిన్‌ సుమారు రూ.4000 నుంచి రూ.5000 వరకు ఉంటుంది. ప్రాణాంతక గర్భాశయ కాన్సర్‌ నుంచి రక్షణ కల్పించే టీకా విషయంలో బాలికలు, తల్లిదండ్రుల్లో అపోహాల కారణంగా లక్ష్యం చేరుకోవడం లేదు. అనారోగ్య సమస్యలు రావొచ్చనే అనుమానంతో వెనుకంజ వేస్తున్నారు. వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తే గానీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కన్పించడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement