ఆసిఫాబాద్‌అర్బన్: సర్వే పేరుతో సాగు పనులను అడ్డుకుంటే సహించేది లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. పోడు భూముల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ‘మా భూములు.. మాకు కావాలి, మా భూములను లాక్కోవద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న గిరిజన, ఆదివాసీ రైతుల భూములను లాక్కుంటే ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. పోడు భూములపై రైతులకు హక్కులు కల్పించేవరకు పోరాడతానని హామీ ఇచ్చారు. విత్తనాలు వేసుకునే సమయంలో ఆటంకాలు సృష్టించొద్దని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలో పోడు రైతులకు పోడు పట్టాలు అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


