కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని నెల రోజులుగా కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ఎస్పీఎం గేటు ఎదుట కార్మికుల దీక్ష శిబిరాన్ని సోమవారం సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మిల్లు నుంచి వెలువడే విషవాయువులతో సమీప సంఘం బస్తి, సర్దార్ బస్తి, ఓల్డ్ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపించారు. మిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడిచి పెట్టాలన్నారు. 10 సభ్యుల కమిటీని రద్దు చేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కొంగ సత్యనారాయణ, వెంకటేశం, ఓదెలు, కార్మికులు రాజేశం, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.


