పాఠశాలలు, అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు అరకొర సౌకర్యాల మధ్యే నిర్వహణ తరచూ కార్యాలయాల మార్పుతో కొత్త చిక్కులు కొత్త మండలాల్లో ప్రజలు, అధికారులకు తప్పని అవస్థలు
ఇది పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల ఈ పాఠశాల భవనంలో అధికారులు ఎంపీడీవో కార్యాలయాలన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులను సంజీవనగర్ పాఠశాల ఆవరణకు తరలించారు. ఇలా జిల్లాలోని కొత్త మండలాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తుండంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పెంచికల్‌పేట్: పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అయితే ఆయాచోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనాలు, తాత్కాలిక భవనాలే దిక్కవుతున్నాయి. జిల్లాలో పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి, లింగాపూర్ నూతన మండలాలు ఏర్పడి సుమారు తొమ్మిదేళ్లు గడిచినా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించలేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, మండల సమాఖ్య, పశుసంవర్ధక, మండల విద్యావనరుల కార్యాయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
ప్రజలకు తప్పని తిప్పలు..
ప్రతిరోజూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ రకాల పనులు నిమిత్తం మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో, సమాఖ్య కార్యాలయాలకు వస్తున్నారు. అద్దె, తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఒకవైపు అధికారులతో పాటు ప్రజలు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా స్పందించి నూతనంగా ఏర్పడిన మండలాలకు అన్ని సౌకర్యాలతో పక్కా భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
అద్దె భవనాల్లో అవస్థలు..
పెంచికల్‌పేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆరె సంక్షేమ సంఘం భవనంలో నిర్వహిస్తుండగా, చింతలమానెపల్లి, లింగాపూర్ కార్యాలయాలను ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాయా ల సేవలను ప్రభుత్వ బడులు, గ్రామ పంచా యితీ కార్యాలయాల్లో అందిస్తున్నారు. ఇటీవ ల పెంచికల్‌పేట్ ఎంపీడీవో కార్యాలయాన్ని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నుంచి ఎంఈవో భవనానికి అక్కడి నుంచి ఎల్కపల్లి ప్రభుత్వ పాఠశాలకు మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రు ణాలను అందిస్తున్న మహిళా సమాఖ్య కార్యాలయాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలోని ఒక గదిలో కొనసాగిస్తున్నారు.
భవనాలు నిర్మించాలి
పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో సరైన సౌకర్యాలు లేవు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు వెంటనే స్పందించి నూతన భవనాలకు నిధులు మంజూరు చేయాలి.
– చప్పిడే తిరుపతి, పెంచికల్‌పేట్
ఇబ్బందులు పడుతున్నాం
నూతన మండలాల్లో ప్రభు త్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. తాత్కాలిక భవనాల్లో విధులు నిర్వహించడానికి అధికారులతోపాటు పనుల నిమిత్తం వచ్చే మేము కూడా ఇబ్బందులు పడుతున్నాం. కార్యాలయాల్లో తాగునీటీ వసతి, మరుగుదొడ్లు కూడా లేవు. భవనాల ఎదుట పడిగాపులు కాస్తూ పనులు పూర్తి చేసుకుంటున్నారు. – బానోత్ రాజేందర్, లింగాపూర్


