ఈ ఫొటోలోని మురుగు కాలువ కన్యకాపరమేశ్వరీ దేవాలయం సమీపంలోనిది. ఏటా వర్షాకాలంలో వరద ఎక్కువ కావడంతో నీరంతా రోడ్డుపైకి చేరి రాకపోకలు నిలిచిపోతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందుగానే చర్యలు చేయిస్తున్నారు. ఇప్పటికే వరద ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రధాన మురుగు కాలువకు లింకు ఉన్న కాలువల్లో పూడిక తొలగిస్తున్నారు.
కాగజ్‌నగర్‌టౌన్: వర్షాకాలం నేపథ్యంలో కాగజ్‌నగర్ పట్టణంలో వరద ముంపు సమస్య తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ప్రధాన మురుగు కాలువ సుమారు ఐదు కిలోమీటర్ల మేర జేసీబీతో యుద్ధ ప్రాతిపదికన చెత్తాచెదారం తొలగింపు పనులు చేపట్టగా, ఇప్పటికే అధిక శాతం పనులు పూర్తయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన ఇందిరా మార్కెట్ ఏరియా, ద్వారకానగర్, సంజీవయ్య కాలనీల గుండా వెళ్లే ప్రధాన మురుగు కాలువలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, చెత్త తొలగించారు. రైల్వే ట్రాక్ అవతలి భాగంలోని డ్రెయినేజీలో ఉన్న పూడిక పనులు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు..
కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ షాహీన్ సుల్తానా, కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో శానిటరీ విభాగం అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షణ చేస్తున్నారు. వర్షపు నీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రవహించేలా పారిశుద్ధ్య సిబ్బంది, జేసీబీల సాయంతో డ్రెయినేజీలు శుభ్రం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను కూడా ఏర్పాటు చేసి పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే పనులు వర్షాలు పడకముందే పూర్తి చేస్తున్నామని చైర్‌పర్సన్ షాహీన్ సుల్తానా తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా..
వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ 08738– 239988 కు ప్రజలు సమస్యలు తెలియజేయవచ్చు.
– తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్


