పెంచికల్‌పేట్/దహెగాం/ఆసిఫాబాద్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా, ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. నాలుగైదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెంచికల్‌పేట్ మండలం పోతెపల్లి గ్రామంలో విద్యుత్ పోల్స్ విరిగిపడటంతో పెను ప్రమాదం తప్పింది. కొండపల్లి గ్రామానికి చెందిన ఉష్ణబోయిన సంతోష్ ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపోయి ఇంట్లోని సామగ్రి తడిసింది. అగర్‌గూడ గ్రామానికి చెందిన రాంటెంకి ఇంటి ఆవరణలో పిడుగుపాటుతో మేక మృతి చెందింది. దహెగాం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయ సమీపంలో గాలిదుమారానికి చెట్టు విద్యుత్ స్తంభంపై పడడంతో స్తంభం నేలకొరిగింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి సైతం మోస్తారు వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు తేలికపాటి వర్షంతో ఉపశమనం కలిగింది. మంగళవారం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు.


