క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

● కలెక్టర్‌ కె.హరిత ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పేదవాడినైన తనకు ఆర్థికసాయం అందించాలని వాంకిడి మండలం వెల్లి గ్రామానికి చెందిన జువెల్ల బాదిరావ్‌ వేడుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడి ధ్రువపత్రం ఇప్పించాలని సిర్పూర్‌(టి) మండల కేంద్రానికి చెందిన హుస్సేన్‌ దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్‌ఎఫ్‌ఓఆర్‌ పట్టా భూమిలో సోలార్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలని కౌటాల మండలం మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన సుధాకర్‌ విన్నవించాడు. తన పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన రౌతు విర్దు ఫిర్యాదు చేశాడు. ఆశవర్కర్‌గా అవకాశం కల్పించాలని లింగాపూర్‌ మండలం భీమానాయక్‌ తండాకు చెందిన సంగీత దరఖాస్తు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తనకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని బెజ్జూర్‌ మండలం సల్గుపల్లికి చెందిన లింగయ్య కోరాడు. దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని ఆసిఫాబాద్‌ మండలం గొడవెల్లికి చెందిన కార్తీక్‌ దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement