ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో సోమవారం కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఎఫ్‌వో బాలామణితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ జిల్లాలో మైదానాల అభివృద్ధి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జన్కాపూర్ క్రీడామైదానానికి స్థలం, వసతుల కల్పన, కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం క్రీడాశాఖ అధికారులతో కలిసి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ సోని బాలాదేవి జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ క్రీడామైదానం, ఆదర్శ పాఠశాల క్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడాపాఠశాలలో జాతీయ, రాష్ట్రస్థాయిలో సాధించిన పతకాలు, ట్రోఫీలను చూసి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణించి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. 400 మీటర్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రీడామైదానం ప్రహరీ, ఇతర మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో స్పోర్ట్స్ డిప్యూటీ డైరక్టర్లు రవీందర్, శ్రీనివాస్, అశోక్, రవితేజ, డీవైఎస్‌వో అశ్వక్ అహ్మద్, డీఎస్‌వో శేకు, ఏటీడీవో చిరంజీవి, కోచ్‌లు అరవింద్, విద్యాసాగర్, తిరుమల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


