పుస్తకాల దందా..! | - | Sakshi
Sakshi News home page

పుస్తకాల దందా..!

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

నిబంధనలు పాటించని ప్రైవేట్‌ స్కూళ్లు నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఇష్టారీతిన పాఠ్యపుస్తకాల అమ్మకం బుక్‌స్టాళ్లతో రహస్య ఒప్పందాలు తల్లిదండ్రులపై మోయలేని ఆర్థిక భారం

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఓ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల స్థానికంగా ఒక బుక్‌స్టాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలలోని విద్యార్థులను అదే బుక్‌స్టాల్‌లో పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను సంప్రదిస్తే బుక్‌స్టాల్‌తో మాకు సంబంధం లేదని దాటవేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అలాగే మార్కెట్‌ ఏరియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి పుస్తకాలకు రూ.3వేలు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రి వాపోయాడు. జిల్లాలోని ఓ స్కూల్‌లో పదోతరగతి డీజీ మ్యాగ్నమ్‌ వర్క్‌బుక్స్‌కు రూ.2,700 తీసుకుంటున్నారు. మరో పాఠశాలలో నర్సరీ విద్యార్థికి బుక్స్‌కే రూ.2వేల వెచ్చించాల్సి వస్తోంది. ఇలా జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలతో వ్యాపారం చేస్తూ నిబంధనలను నీళ్లలో తొక్కుతున్నాయి.

కాగజ్‌నగర్‌టౌన్‌: పిల్లలకు చదువు చెప్పాల్సిన ప్రైవేటు పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు వర్క్‌బుక్స్‌, గైడ్లు, నోట్‌పుస్తకాలను కేవలం తాము చెప్పిన బుక్‌స్టాల్‌లోనే తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. యూనిఫాంలు కూడా నిర్దేశించిన షాపులోనే కొనుగోలు చేయాలని ఆదేశిస్తున్నాయి. ఇలా నర్సరీ నుంచే తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రైవేట్‌ యాజమాన్యాల తీరుపై ఆరోపణలు బహిరంగ రహస్యమే అయినా చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

చర్యలు శూన్యం..

విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలలు నిర్దిష్ట దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనాలని ఒత్తిడి చేయడం చట్ట విరుద్ధం. ఎమ్మార్పీ లేకుండా వస్తువులు అమ్మడం వినియోగదారుల చట్టం ఉల్లంఘనే అవుతుంది. ఎన్‌సీఈఆర్టీ, ఎస్‌సీఈఆర్టీ సిలబస్‌కు అనుగుణంగా ఉండే పుస్తకాలు ఎక్కడైనా కొనే స్వేచ్ఛ ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. ఈ విషయమై డీఈవో, లీగల్‌ మెట్రాలజీ అధికారులు స్పందించి బుక్‌స్టాల్‌, స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలి. నిబంధనలు అతిక్రమించేవారిపై చర్యలు తప్పవు. పాఠ్యపుస్తకాలు, ఇతర బుక్స్‌ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం.

– సచ్చిదానంద చారి, జిల్లా విద్యాధికారి

ఎమ్మార్పీ లేకుండానే అమ్మకాలు

ప్రైవేటు పాఠశాలలు, బుక్‌స్టాల్‌లో అమ్ముతున్న వర్క్‌బుక్స్‌పై ఎమ్మార్పీ ముద్రించకపోవడంతోపాటు ఇష్టారీతిగా రేట్లు పెట్టి అమ్ముతున్నారు. మార్కెట్‌లో కంటే 30 నుంచి 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. కొందరు ధైర్యం చేసి ప్రశ్నిస్తే అడ్మిషన్‌ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్‌ ఫీజు వసూలు చేయరాదు. 25 శాతం సీట్లు పేద పిల్లలకు ఉచితంగా కేటాయించాలి. కానీ జిల్లాలో సుమారు 110 ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఫైర్‌సేఫ్టీ, అగ్ని ప్రమాదాల నివారణ సర్టిఫికెట్లు, బస్సుల కండీషన్‌ సర్టిఫికెట్లు లేకుండానే స్కూళ్లు నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement