ఆసిఫాబాద్‌రూరల్: వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై ఆరురోజులైనా విద్యార్థుల హాజరు శాతం అంతంతా మాత్రంగానే ఉంది. మొదటిరోజు అమావాస్య, రెండోరోజు మంగళవారం కావడంతో కొందరు తల్లి దండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపలేదు. పైగా, జిల్లాలో ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నా రు. శనివారం జిల్లాలో 40 డిగ్రీలపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం నుంచి శనివారం వరకు క్రమంగా హాజరు శాతం పెరుగుతున్నా ఆశించిన స్థాయిలో లేదు. వాతావరణం చ ల్లబడితే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు భా విస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా పాఠశాలల్లో అందరినీ ఒకే తరగతి గదిలో కూర్చోబెడుతుండడం కనిపించింది.
కొత్తగా అడ్మిషన్లు
జిల్లాలో మొత్తం 1,258 పాఠశాలలున్నాయి. డీఈ వో పరిధిలోని లోకల్ బాడీ స్కూళ్లు 704 ఉన్నాయి. మిగతా 520 పాఠశాలల్లో గిరిజన ఆశ్రమ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, గురుకులాలున్నాయి. వీటిలో సుమారు 85వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డీఈవో పరిధిలో 704 పాఠశాలల్లో సుమారు 31,469 మంది విద్యార్థులున్నారు. ఈ నెల 6నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 1,650 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. జిల్లాలో గతేడాది 41 ప్రీ ప్రైమారీ స్కూళ్లు ఉండగా, ఈ సంవత్సరం 77 స్కూళ్లు ఏర్పాటు కావడంతో వీటి సంఖ్య 118కి చేరింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ తరగతులు ఉండటంతో చాలామంది విద్యార్థులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపేవారని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులతో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
15నుంచి 20వ తేదీ వరకు హాజరు వివరాలు
మండలం స్కూళ్లు విద్యార్థులు 15 16 17 18 19 20
కాగజ్‌నగర్ 101 4,436 1,090 1,848 1,945 2,354 2,565 2,698
ఆసిఫాబాద్ 78 4,279 527 1,044 1,573 1,670 1,833 1,928
బెజ్జూర్ 47 1,974 307 611 740 812 946 1,015
చింతలమానెపల్లి 40 1,854 324 575 740 812 946 1,005
దహెగాం 53 2,283 484 978 1,218 1,252 1,402 1,520
జైనూర్ 28 1,531 230 408 495 536 558 664
కెరమెరి 56 2,140 457 778 933 947 1,016 1,205
కౌటాల 39 1,994 347 614 722 780 855 958
లింగాపూర్ 17 713 116 230 292 323 343 396
పెంచికల్‌పేట్ 27 1,323 260 524 571 721 793 848
రెబ్బెన 58 2,201 435 914 1,056 1,157 1,226 1,358
సిర్పూర్(టి) 51 2,295 700 961 1,118 1,213 1,210 1,289
సిర్పూర్(యు) 21 1,162 173 263 289 274 334 397
తిర్యాణి 27 767 224 284 320 321 362 428
వాంకిడి 61 2,517 498 850 1,005 1,093 1,241 1,325
మొత్తం 704 31,469 6,167 10,882 13,017 14,268 15,504 17,134
హాజరుశాతం పెంచుతాం
జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు పాఠశాలలకు పంపిస్తలేరు. ఉపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. దీంతో క్రమంగా హాజరు శాతం పెరుగుతోంది. 100శాతం హాజరు నమోదుకు కృషి చేస్తాం.
– సచ్చిదానందచారి, డీఈవో


