ఎరువుల గండం..! | - | Sakshi
Sakshi News home page

ఎరువుల గండం..!

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

● జిల్లాకు సరఫరా అంతంతే.. ● పెరిగిన ధరలతో అన్నదాతలపై ఆర్థిక భారం ● జూలై, ఆగస్టులో అధిక వినియోగం

కౌటాల: జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పేలా లేవు. గతేడాది మాదిరిగా ఈసారీ నిల్వలు అంతంత మాత్రమే ఉన్నాయి. జూన్‌లోనే కొరత ఉండటంతో జూలై, ఆగస్టు నెలల్లో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 8 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేశారు. ఇప్పటికే యాప్‌ వినియోగంపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. గతంలో కేంద్ర ప్రభుత్వం పెద్దసంఖ్యలో యూరియా ర్యాక్‌లు పంపించేది. ప్రస్తుతం సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ సరఫరాలో గతేడాది నుంచి కోత విధిస్తోంది. మే నెలాఖరు వరకు జిల్లాకు 12,190 మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే దిగుమతి అయింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు జూన్‌కు మాత్రమే సరిపోతాయి. రైతులు జూన్‌ నెలాఖరు నుంచి వినియోగం ప్రారంభించి జూలై, ఆగస్టులో అధికంగా వినియోగిస్తారు. వరినాట్లు ప్రారంభమైతే మరిత వినియోగిస్తారు.

ఇప్పటికే పెరిగిన ‘కాంప్లెక్స్‌’ ధరలు

వానాకాలం సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. యూరియా, డీఏపీ మినహాయించి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఒక్కో సంచిపై రూ.400 వరకు పెరిగింది. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. పత్తి, సోయా, కంది పంటలకు కనీసం ఎకరానికి అయిదారు సంచుల కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తారు. ఒక్కో రైతుపై రూ.4 వేల వరకు అదనపు భారం పడనుంది.

మహారాష్ట్రకు వెళ్తున్నాం

పత్తి పంట సాగుకు ఎరువులను అధికంగా వినియోగిస్తాం. యాప్‌లో ఎకరానికి కేవలం రెండు బస్తాలే ఇస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు వెళ్లి యూరియా కొనుగోలు చేసుకుంటున్నాం. యాప్‌తోపాటు సహకార సంఘాల్లో పంపిణీ చేస్తే బాగుంటుంది. యూరియా కావాలంటే ఇతర మందులు కొనాలని డీలర్లు అంటున్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– మహేశ్‌, బెజ్జూర్‌

సరిపడా అందిస్తాం

జిల్లాలోని పంటల సాగుకు సరిపడా ఎరువులను సరఫరా చేస్తాం. ఇప్పటివరకు 8 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపిణీ చేశాం. యూరియా, ఇతర ఎరువుల సరఫరా విషయంలో గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. ప్రతినెలా సరిపడా అందిస్తోంది. జిల్లాకు అవసరమైన ఎరువులు అందించాలని ప్రభుత్వానికి నివేదించాం. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దు.

– వెంకటి, జిల్లా వ్యవసాయాధికారి

సరిహద్దు దాటి..

గతేడాది జిల్లాలో పంటల సాగుకు 60 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా.. ప్రభుత్వం 48 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. యూరియా కోసం అన్నదాతలు తిప్పలు పడ్డారు. గతేడాది యూరియా సక్రమంగా వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం ఫర్టిలైజర్‌ యాప్‌లో ఎకరానికి కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే అందిస్తున్నారు. కౌలు రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరిహద్దులోని మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయా ఫర్టిలైజర్‌ దుకాణాల్లో బస్తాకు రూ.700 చెల్లించి ప్రత్యేక వాహనాల్లో కౌటా ల, బెజ్జూర్‌ మండలాలకు తరలిస్తున్నారు. మరోవైపు యాప్‌ ద్వారా విక్రయిస్తే ఎక్కువ మార్జిన్‌ ఉండటం లేదని కొందరు వ్యాపారులు రైతులకు యూరియాతోపాటు ఇతర ఎరువులు, పత్తి విత్తనాలు అంటగడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement