మళ్లీ తొలిమెట్టు..! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తొలిమెట్టు..!

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

విద్యా సామర్థ్యాల పెంపునకు జూలై 1 నుంచి ప్రారంభం ఈసారి గిరిజన బడుల్లోనూ అమలుకు నిర్ణయం షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం

కెరమెరి: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు మరోమారు ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసి(తొలిమెట్టు) కార్యక్రమాన్ని జూలై 1 నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జాతీయ విద్యావిధానం లక్ష్యాలకు అనుగుణంగా నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో ఈ ఏడాది గిరిజన ప్రాథమిక పాఠశాలల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. 2026– 27 విద్యా సంవత్సరంలో కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల్లో మౌలిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు ఏఐ(అర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) ద్వారా బోధన ప్రారంభించారు. 2026– 27 విద్యా సంవత్సరంలో ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్‌, గణితం అంశాల్లో సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయనున్నారు.

షెడ్యూల్‌ విడుదల.. అమలు ఇలా..

జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలు మొత్తం 660 ఉండగా, గిరిజన ప్రాథమిక పాఠశాలలు 334 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 39,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జూలై 1 నుంచి 10 మధ్యలో బేస్‌లైన్‌ పరీక్ష, నవంబర్‌ 20 నుంచి 30 మధ్యలో మిడిల్‌ లైన్‌ పరీక్ష, 2027 మార్చి 7 నుంచి 17 వరకు ఎండ్‌ లైన్‌ పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంటుంది. బేస్‌లైన్‌ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన ప్రగతిని ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా మూడు బృందాలుగా ఏర్పాటు చేసి వారి స్థాయిని పెంచేలా చర్యలు తీసుకోవాలి. వర్క్‌బుక్‌లోని ప్రాక్టీస్‌ షీట్ల ఆధారంగా అభ్యసన ప్రగతిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 1 నుంచి 5 తరగతి వరకు విద్యార్థులకు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. కథలు, ఆటలు, పాటలు, వివిధ కృత్యాల ఆధారంగా బోధనను మరింత ఆసక్తికరంగా మార్చనున్నారు. అభ్యసన సామర్థ్యాలను అంచనా వేస్తూ నిరంతర మూల్యాంకనం చేపట్టనున్నారు. అందరికీ చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల్లో నిర్దేశిత స్థాయిని సాధించేలా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు గతంలోనే శిక్షణ ఇవ్వగా, వేసవి సెలవులకు ముందు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు సైతం శిక్షణ అందించారు.

ప్రభుత్వ ప్రాథమికోన్నత

పాఠశాలలు 100

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు 560

గిరిజన ప్రాథమిక పాఠశాలలు 334

జిల్లా వివరాలు

వారంలో మూడు రోజులు తనిఖీలు

ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టనున్నారు. మండల విద్యాధికారులు వారంలో మూడు రోజులు ఐదారు పాఠశాలలను పరిశీలించాలి. ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఎలా అమలవుతుందో ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు వారానికి నాలుగైదు పాఠశాలలను సందర్శించాలి. వీరితోపాటు డీఈవో, సమగ్ర శిక్ష సెక్టోరియల్‌ అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు తనిఖీలు చేసి తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును తెలుసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement