యాసంగి ‘భరోసా’ ఏమాయే..! | - | Sakshi
Sakshi News home page

యాసంగి ‘భరోసా’ ఏమాయే..!

Jun 19 2026 11:55 PM | Updated on Jun 19 2026 11:55 PM

రెండెకరాలకే పరిమితమైన పెట్టుబడి సాయం జిల్లాలో మొదలైన సాగు పనులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలు ఈ నెల 30న వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల?

రెబ్బెన: వానాకాలం సాగు పనులు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. అయినా యాసంగి పెట్టుబడి సాయం మాత్రం పూర్తిగా అందలేదు. కేవలం రెండు దఫాల్లో రెండెకరాల వరకు మాత్రమే ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు ప్రభుత్వం ఈ నెల 30 నుంచి వానాకాలం సీజన్‌ డబ్బులు అందిస్తామని ప్రకటించింది. దీంతో యాసంగి సాయంపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. రైతుభరోసా పథకం కింద ఎకరానికి సీజన్‌కు రూ.6వేల చొప్పున రెండు సీజన్‌లకు కలిపి రూ.12వేలు అందిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గడిచిన యాసంగి సీజన్‌లో రెండు దఫాల్లో రూ.6వేల చొప్పున మొత్తం రూ.12వేలు మాత్రమే అందింది. జిల్లాలో 1,44,511 మంది రైతులు ఉండగా పెట్టుబడి సాయం కింద రూ.92.027 కోట్లు చెల్లించాలి. 1,35,520 మంది రైతులు మాత్రమే బ్యాంకు ఖాతాలు అందించగా ఏఈవోలు విచారణ చేపట్టి వారిలో నుంచి 1,32,854 మంది వివరాలను ట్రెజరీకి పంపించారు. ప్రభుత్వం గత యాసంగి సీజన్‌లో 1,32,475 మంది రైతుల ఖాతాల్లో రూ.73,84,63,218 నగదు జమ చేసింది. వ్యవసాయానికి యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ఎలాంటి భూపరిమితిని విధించలేదు. సాగుకు యోగ్యంగా ఎన్ని ఎకరాలు ఉన్నా పెట్టుబడి సాయం అందించాలి. సీజన్‌ చివరి వరకు ఎదురు చూసినా నిరాశే మిగిలింది. ప్రస్తుతం వానాకాలం ప్రారంభం కావడంతో డబ్బులు ఎప్పుడు వస్తాయోనని మదనపడుతున్నారు.

వానాకాలం సాగు షురూ

తొలకరి వర్షాలు పడటంతో జిల్లా రైతులు సాగు పనులు ప్రారంభించారు. గతేడాది మాదిరిగానే ఈసారి సైతం జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 90శాతం మంది రైతులు పత్తిసాగుకు దుక్కిదున్ని సిద్ధం చేశారు. రుతుపవనాలు రాక కాస్త ఆలస్యమవుతుండగా, అయినా కొందరు విత్తనాలు విత్తుతున్నారు. ఈ సమయంలో రైతుభరోసా నగదు అందిస్తే ఉపయోగకరంగా మారనుంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఉపయోగపడేది.

వానాకాలం సాయానికి డేట్‌ ఫిక్స్‌?

వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 30న నగదు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులతో సీఎం నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చించినట్లు సమాచారం. త్వరలో ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని సీఎం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయం రైతులకు కాస్త సంతోషాన్ని కలిగించే అంశమే అయినా యాసంగికి సంబంధించిన పెట్టుబడి సాయం ఇక లేనట్టేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement