శ్రీరాంపూర్: బీజేపీ సింగరేణి భరోసా యాత్ర ఉద్రిక్తంగా మారింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పలువురు నేతల బృందం శుక్రవారం శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు గని సందర్శనకు బయల్దేరింది. పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్‌రెడ్డి, పాల్వాయి హరీష్‌బాబు, రామారావుపటేల్, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు మధ్యాహ్నం శ్రీరాంపూర్ బస్టాండ్‌కు చేరుకున్నారు. కార్మికుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కాన్వాయ్‌గా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టుకు బయల్దేరారు. అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున చెక్‌పోస్టు వద్ద బారికేడ్లు పెట్టి రోడ్డు మూసివేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాము ఎమ్మెల్యేమని, ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఓసీపీ సందర్శనకు అనుమతి లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేలు జీఎం, ఇతర అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లేందుకు బారికేడ్లు తోయగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎమ్మెల్యేలను బలవంతంగా పోలీసు, ఎమ్మెల్యేల వాహనాల్లో కూర్చోబెట్టి స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలు వాహనాలను అడ్డంగించారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం అక్కడి నుంచి ఎస్సార్పీ 3 గని సందర్శనకు వెళ్లగా అక్కడా అడ్డుకున్నారు. దీంతో నేతలు స్థానిక పీవీఆర్ గార్డెన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కార్ ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. చివరికి గనుల సందర్శన లేకుండా నేతలు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, పెద్దపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జీ గోమాస శ్రీనివాస్, మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ ముకేశ్‌గౌడ్, నాయకులు కందుల సంధ్యారాణి, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ నేతలు నాగేశ్వర్‌రావు, రమేశ్, కుర్రె చక్రి, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


