ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని అక్రమంగా ఏర్పాటు చేసిన టేలాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ అంజయ్య టేలాలు తొలగించాలని యజమానులకు నోటీసులు జారీ చేశారు. జిల్లా ఆస్పత్రి ప్రహరీని ఆనుకుని డ్రెయినేజీపై నిబంధనలకు విరుద్ధంగా టేలాలు ఏర్పాటు చేశారు. తద్వారా డ్రెయినేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. కొన్ని నెలలుగా సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి అధికారులు కలెక్టర్ హరిత దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కలెక్టర్ డ్రెయినేజీపై ఏర్పాటు చేసిన టేలాలను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో కమిషనర్ వారం రోజుల్లోగా టేలాలు తొలగించాలని సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేశారు. యజమానులు వారి టేలాల పరిధిలోని డ్రెయినేజీ నుంచి చెత్త తొలగించారు. అయితే పూర్తిస్థాయిలో టేలాల తొలగింపు జరుగుతుందో లేదో వేచిచూడాలి.
జిల్లా కేంద్రంలో 135కు పైగా టేలాలు
ఆస్పత్రి ప్రహరీ, జేబీఎస్, ఉర్దూ పాఠశాల, ఆర్టీసీ డిపో ప్రహరీలకు ఆనుకుని సుమారు 135 టేలాలు ఏర్పాటు చేశారు. గతంలో గ్రామ పంచాయతీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ దందా విచ్చలవిడిగా సాగింది. కొంతమంది టేలాల యజమానులు మున్సిపాలిటీకి మామూలు అద్దె చెల్లిస్తూ రూ.వేలకు ఇతరులకు అద్దెకు ఇచ్చుకున్నారు. మరికొంత మంది రెండు నుంచి మూడు టేలాల వేసుకుని అద్దెకిచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. వారం రోజుల్లోగా టేలాలు తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.


