ఆసిఫాబాద్: సెల్ టవర్ల నిర్మాణంతో టెలికాం సేవలు మెరుగుపడతాయని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులు పూర్తి చేయాలని టెలికాం సంస్థల ప్రతినిధులకు సూచించారు. సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్ సేవలు కీలకప్రాత పోషిస్తున్నందున టెలికాం సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణం, ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ పనుల పురోగతిని సమీక్షించారు. భూ సమస్యలు, అనుమతులు తదితర అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ వినయ్, బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్‌టెల్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
భూముల సర్వే వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో భూముల సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో భూముల సర్వే పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నకలు లేని గిరిజన భూములు, సాదాబైనామా దరఖాస్తులు, భూ సంబంధిత పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను నెలాఖరులోగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులు పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


