మహిళా సంఘాలకు పెరిగిన రుణ లక్ష్యం గతేడాదికి మించి అందించాలని నిర్ణయం జిల్లాలోని 8,163 సంఘాలకు రూ.239.77 కోట్లు లక్ష్యం
తిర్యాణి: స్వయం ఉపాధి కల్పనకు మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు మరింత అందనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ లక్ష్యాన్ని పెంచుతూ ఖరారు చేశారు. అతివలు స్వయం ఉపాధిలో రాణించేలా సోలార్‌ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వ్యాపారులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి రుణాలు ఉపయుక్తంగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధిలో రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేస్తోంది. ఆర్థిక చేయూత అందిస్తూ ఏటా తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తుంది. సభ్యులు తీసుకున్న మొత్తాలను నెలవారీ వాయిదాల రుణంలో తిరిగి చెల్లిస్తుంటారు.
ఈ ఏడాది రూ.239.77 కోట్ల చెల్లింపులు
జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏటా పరిమితికి మించి బ్యాంకులు రుణాలు చెల్లిస్తున్నాయి. గత ఆర్థిక సంవతర్సంలో రూ.232 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే లక్ష్యానికి మించి రూ.234 కోట్లను సంఘాలకు చెల్లించారు. ఈ నేపథ్యంలో 2026– 27 ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితి మరింత పెంచారు. జిల్లాలో 8,163 సంఘాలకు రూ.239.77 కోట్ల రుణాలు చెల్లించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీంతో ఈ ఏడాది మరిన్ని సంఘాలకు రుణాలు అందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కాగజ్‌నగర్ మండలంలో రూ.27.46 కోట్లు, ఆసిఫాబాద్‌లో రూ.20.92 కోట్లు, వాంకిడి మండలంలో రూ.19.25 కోట్లు అందించనుండగా, అత్యల్పంగా పెంచికల్‌పేట్ మండలంలో రూ.8.09 కోట్లు, సిర్పూర్(యు)లో రూ.8.41 కోట్లు, లింగాపూర్‌లో రూ.9.37 కోట్లు చెల్లించనున్నారు.
బస్సులు, సోలార్ ప్లాంట్‌తో అభివృద్ధి బాట
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం రుణాలకే పరిమితి కాకుండా స్వయం ఉపాధి పొందేలా ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, విద్యార్థుల యూనిఫాం కుట్టు పనులు, వడ్ల కొనుగోళ్లు తదితర పనులు అప్పగిస్తూ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే రెబ్బెన మండలం నంబాల గ్రామంలో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలిగిన సోలార్ ప్లాంట్‌ను రూ.6కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు దాదాపు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్‌ను రూ.3.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇందులో వచ్చిన లాభాల్లో రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల సమైక్యలతోపాటు జిల్లా సమైక్యకు చెల్లిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఇటీవల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే ఇప్పటికే జిల్లాలో 15 మండల సమైక్యల కోసం 15 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్సు ద్వారా ప్రతినెలా రూ.69,485 ఆదాయం సమకూరుతోంది.
మండలాల వారీగా బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం
మండలం సంఘాలు లక్ష్యం
(రూ.కోట్లలో)
ఆసిఫాబాద్ 682 20.92
బెజ్జూర్ 467 15.21
దహెగాం 535 16.19
జైనూర్ 575 18.22
కాగజ్‌నగర్ 900 27.46
రెబ్బెన 690 18.93
సిర్పూర్(యు) 312 8.41
సిర్పూర్(టి) 507 13.84
వాంకిడి 743 19.25
తిర్యాణి 511 15.59
పెంచికల్‌పేట్ 267 8.09
లింగాపూర్ 279 9.37
కౌటాల 622 18.12
కెరమెరి 556 15.31
చింతలమానెపల్లి 517 14.79
మొత్తం 8,163 239.77
లక్ష్యం నిర్దేశించాం
జిల్లాలో 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 8,163 మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.239.77 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించాం. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు అందించి రాష్ట్ర స్థాయిలో మన్ననలు అందుకున్నాం. అదే స్ఫూర్తితో ఈ ఏడాది సైతం టార్గెట్ చేరుతాం. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి.
– నరేందర్, డీపీఎం


