పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 5 2026 11:41 PM | Updated on Jun 5 2026 11:41 PM

● కలెక్టర్‌ కె.హరిత

పెంచికల్‌పేట్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పెంచికల్‌పేట్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో ఎస్పీ నితిక పంత్‌, డీఎఫ్‌వో బాలామణి, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌లతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువులను వాడితే ప్రకృతిని కాపాడుకోవచ్చన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రత పెరగడం, నీటి లభ్యత తగ్గడం మానవాళి మనుగడకు ప్రమాదమని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడాలని, ప్రతీ వర్షపు నీటి బొట్టును భూమిలో ఇంకేలా చూడాలన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో అప్పయ్య, రేంజ్‌ అధికారి అనిల్‌కుమార్‌, సర్పంచ్‌ రాంచందర్‌, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

యాప్‌లోనే ఇసుక అనుమతులు

కాగజ్‌నగర్‌టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా ను అరికట్టేందుకు మన ఇసుక వాహనం యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, యాప్‌లోనే స్లాట్‌ బుక్‌ చేసుకుని ఇసుక అనుమతులు పొందాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం కొత్త సార్సాల గ్రామ సమీపంలోని వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం అడ్డుకుని అనుమతి పత్రాలు పరిశీలించారు. సరైన అనుమతులు లేకుండా వాగులు, ఒర్రెల నుంచి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

‘బడిబాట’ విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఈవో సచ్చిదానంద, చారి, డీటీడీవో రమాదేవితో కలిసి ఎంఈవోలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాం, నోట్‌బుక్స్‌ అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌వో శ్రీనివాస్‌, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్‌, డీఎల్‌పీవో ఉమర్‌ హ్సుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement