ఆసిఫాబాద్‌రూరల్: అంకితభావంతో పనిచేస్తే ఉపాధ్యాయులు గుర్తింపు పొందుతారని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం 2025– 26 విద్యాసంవత్సరంలో ఉత్తమ సేవలు అందించిన 200 మంది ఉపాధ్యాయులు, ప్రతిభ చూపిన 800 మంది విద్యార్థులకు సంబంధించిన ప్రశంసాపత్రాలను సంబంధిత ఎంఈవోలకు అందజేశారు. డీఈవో మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభ్యన్నతికి నిరంతర కృషి, విధి నిర్వహణలో అంకితభావం, 90 శాతానికి పైగా హాజరు, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో క్రమశిక్షణకు కృషి చేసిన ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ ప్రశంసాపత్రాలు పంపించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేసి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్టినేటర్ శ్రీనివాస్, కమ్యూనిటీ కోఆర్టినేటర్ కె.శ్రీనివాస్, ఎంఈవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


