నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

● జిల్లాలో ఏడు కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 2,467 మంది విద్యార్థులు ● ఉదయం ఫస్టియర్‌, మధ్యాహ్నం సెకండియర్‌ పరీక్షలు

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏడు కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,467 మంది పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 1,632 మంది, ఒకేషనల్‌ విభాగంలో 138 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగంలో 697 మంది, జనరల్‌ విభాగంలో 89 మంది ఉన్నారు.

ఉదయం, మధ్యాహ్నం నిర్వహణ

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21 వరకు కొనసాగనున్నాయి. ఫస్టియర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, 90 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్‌ కాపీయింగ్‌ తావులేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థులు పరీక్ష సమయం కంటే 30 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాల నిబంధన అమలులో ఉంది.

పరీక్ష కేంద్రాలు ఇవే..

సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తెలంగాణ మోడల్‌ స్కూల్‌, కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వసుంధర డిగ్రీ కళాశాల, రెబ్బెన, కౌటాల, జైనూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు కొనసాగుతాయి. వాంకిడి, కెరమెరి, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌, తిర్యాణి, సిర్పూర్‌(యు), సిర్పూర్‌(టి) మండలాల విద్యార్థులకు దూరభారంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement